హైదరాబాద్, వెలుగు: గల్ఫ్ ఎన్నారై పాలసీ రూపకల్పన కోసం తెలంగాణ ప్రభుత్వం నియమించిన ఎన్నారై అడ్వయిజరీ కమిటీ ఏపీలో పర్యటించనుంది. మంగళవారం హైదరాబాద్ ప్రజాభవన్ నుంచి ఏపీ పర్యటనకు వెళ్లారు. సీఎం ప్రజావాణి నోడల్ ఆఫీసర్ దివ్యా దేవరాజన్ యాత్రను ప్రారంభించారు.
నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి, కమిటీ చైర్మన్ బీఎం వినోద్ ఈ బృందానికి నాయకత్వం వహిస్తున్నారు. ఈ కమిటీ ఏపీలో బుధ, గురువారాల్లో పర్యటించి గల్ఫ్ వలస కార్మికుల సంక్షేమానికి అమలుచేస్తున్న కార్యక్రమాలపై అధ్యయనం చేయనుంది. కార్యక్రమంలో వైస్ చైర్మన్ మంద భీంరెడ్డి, మెంబర్లు సింగిరెడ్డి నరేష్ రెడ్డి, నంగి దేవేందర్ రెడ్డి, శ్రీనివాసరావులు పాల్గొన్నారు.
