జర్మనీలో ఉద్యోగాలకు తెలంగాణ నర్సులు

జర్మనీలో ఉద్యోగాలకు తెలంగాణ నర్సులు

తెలంగాణ -జర్మనీ మధ్య సమన్వయం, సహకారం మరింత పెరగనుందని, ఈ నేపథ్యంలో వృత్తి నైపుణ్యాభివృద్ధి, ఉపాధి కల్పన, పారిశ్రామిక రంగాల్లో ఇరు ప్రాంతాలకు విశేష అవకాశాలు ఉంటాయని మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. బుధవారం సెక్రటేరియెట్‌‌లో జర్మనీలోని తురింగియా రాష్ట్ర ఉన్నతస్థాయి ప్రతినిధి బృందంతో ఆయన సమావేశమయ్యారు. విదేశీ ఉపాధి అవకాశాలపై విస్తృతంగా చర్చించారు. 

జర్మనీలో ఉద్యోగాలకు తెలంగాణ నర్సులు..

టామ్‌‌కామ్ ద్వారా శిక్షణ పొందిన నర్సుల బృందం ఈ సమావేశంలో మంత్రి వివేక్, జర్మన్ ప్రతినిధులను కలిశారు. భాషా శిక్షణ, విదేశీ ఉద్యోగ అవకాశాలు, ప్లేస్‌‌మెంట్ కార్యక్రమాలపై తమ అనుభవాలను వారు పంచుకున్నారు. ఉన్నత స్థాయి జర్మన్ భాషా అర్హత సాధించిన ఈ నర్సులు.. త్వరలోనే టామ్‌‌కామ్ సహకారంతో జర్మనీలో ఉద్యోగాల్లో చేరనున్నారు. 

ఈ సమావేశంలో ఎల్‌‌ఈటీఎఫ్ కార్యదర్శి దాసరి హరిచందన టామ్‌‌కామ్ ద్వారా అమలు చేస్తున్న శిక్షణా కార్యక్రమాలకు సంబంధించిన సాంకేతిక, నిర్వహణ అంశాలను వివరించారు. ఈ సమావేశం నైపుణ్యాభివృద్ధి, అంతర్జాతీయ ఉపాధి కల్పన రంగాల్లో తెలంగాణ-, జర్మనీ మధ్య బలోపేతమవుతున్న భాగస్వామ్యానికి ప్రతీకగా నిలిచిందని మంత్రి కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఉపాధి, శిక్షణ శాఖ డైరెక్టర్ కాంతి వెస్లీ, టామ్‌‌కామ్ అధికారులు నాగభారతి, అనిల్ కుమార్ పాల్గొన్నారు.