సొంతూళ్లకు ఎలా రావాలె?..గల్ఫ్​దేశాల్లో మనోళ్ల అవస్థలు

సొంతూళ్లకు ఎలా రావాలె?..గల్ఫ్​దేశాల్లో మనోళ్ల అవస్థలు
  • కరోనా ఎఫెక్ట్​తో ఆగమైన బతుకులు.. పనులు లేక తీవ్ర ఇబ్బందులు
  • ఖల్లివెల్లి అయినోళ్ల పరిస్థితి మరీ దయనీయం
  • రెంట్లు కట్టలేక రోడ్లపైనే జీవితం.. బుక్కెడు బువ్వ కోసం తిప్పలు
  • వందే భారత్ మిషన్ కింద ఇండియాకు వచ్చేందుకు ఎదురుచూపులు

ఉపాధి లేక, నిలువ నీడ లేక గల్ఫ్​దేశాల్లో తెలంగాణ వాసులు ఆగమైతున్నారు. సొంతూళ్లకు వస్తామని, ఆదుకోవాలని ఎదురుచూస్తున్నారు. వివిధ దేశాల్లో చిక్కుకున్న ఇండియన్స్​ను తీసుకువచ్చేందుకు ఇటీవల కేంద్రం వందేభారత్ మిషన్​ను ప్రారంభించగా.. ఇందులో గల్ఫ్ నుంచే సుమారు లక్ష మంది దాకా రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. వీరిలో ఎక్కువ మంది కేరళ, తెలంగాణవాళ్లే ఉన్నారు.

గల్ఫ్​లో మనోళ్లు 8 లక్షల మంది

సౌదీ అరేబియా, యూఏఈ, కువైట్, ఒమన్, ఖతార్, బహ్రెయిన్  తదితర దేశాల్లో సుమారు 8 లక్షల మంది దాకా  తెలంగాణవాసులు ఉన్నట్లు ఓ అంచనా.  అనధికారికంగా ఇంకో 2 లక్షల మంది వరకు ఉండొచ్చని ప్రవాసీ మిత్ర లేబర్ యూనియన్, ఇమిగ్రెంట్స్ వెల్ఫేర్ ఫోరమ్ తదితర సంస్థలు చెబుతున్నాయి. అయితే.. మనవాళ్లు ఏ దేశంలో ఎంతమంది ఉన్నారనేందుకు రాష్ట్ర ప్రభుత్వం వద్ద సరైన లెక్కాపత్రం లేదు. కొన్నాళ్ల కింద వివిధ జిల్లాల్లో లెక్కింపు ప్రక్రియ చేపట్టినా ఎందుకో అది మధ్యలోనే ఆగిపోయింది. మూడు నాలుగు నెలలుగా గల్ఫ్ దేశాల్లో కరోనా విజృంభిస్తోంది. దీని ఎఫెక్ట్​తో ప్రపంచ మార్కెట్లలో క్రూడ్​ఆయిల్​ధరలు పడిపోవడంతో గల్ఫ్ లోని అనేక కంపెనీలు దివాలా దిశగా పయనిస్తున్నాయి. చిన్న చిన్న కంపెనీలైతే క్లోజ్​ అయ్యాయి. అందులో పనిచేస్తున్నవారు రోడ్డునపడ్డారు. కరోనా కట్టడికి గల్ఫ్​లోని చాలా ప్రాంతాల్లోనూ లాక్​డౌన్​ అమలవుతోంది. కొన్ని కంపెనీలు కార్మికుల కోసం ప్రత్యేక క్యాంపులు ఏర్పాటు చేసినప్పటికీ.. ఆ క్యాంపుల్లో సరైన సదుపాయాలు లేక కార్మికులు ఇబ్బందులు పడుతున్నారు. లాక్‌డౌన్ మరింత కాలం పొడిగిస్తే మాత్రం గల్ఫ్‌ దేశాల్లో సుమారు 25 శాతం ఉద్యోగాలు పోయే చాన్స్ ఉందని అంచనా. ఇదే జరిగితే రాబోయే ఆరు నెలల కాలంలో అక్కడి తెలంగాణవారిలో నాలుగోవంతు అంటే సుమారు 2లక్షల మంది దశలవారీగా ఇండియాకు వాపస్ వచ్చే అవకాశం ఉంది.

వందే భారత్ మిషన్ కింద..

కరోనా లాక్ డౌన్ తో విదేశాల్లో చిక్కుకున్న ఇండియన్లను దశల వారీగా తీసుకొస్తామని చెప్పిన కేంద్ర ప్రభుత్వం.. తొలివిడతగా ఈ  నెల 7 నుంచి 13 వరకు వారం పాటు 64 ఫ్లైట్లలో 14,800 మంది తరలించాలని నిర్ణయించింది. వీటిలో అమెరికా, ఫిలిప్పీన్స్, సింగపూర్, బంగ్లాదేశ్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) , బ్రిటన్, సౌదీ అరేబియా, ఖతార్, ఒమన్, బహ్రెయిన్, కువైట్, మలేసియా ఉన్నాయి. ఇందులో గల్ఫ్ దేశాలకే ఏకంగా 24 ప్లైట్లను నడుపుతోంది. తొలుత లేబర్, మెడికల్ ఎమర్జెన్సీ ఉన్నవారు, ముసలివాళ్లు, ప్రెగ్నెంట్ ఉమెన్​కు చాన్స్ ఇస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొటోకాల్ (ఎస్ఓపీ) సిద్ధం చేశారు. ఈ పథకం కింద ఇండియాకు వచ్చేందుకు గల్ఫ్ కంట్రీస్ నుంచే సుమారు లక్షమంది వరకు అప్లై చేసుకున్నట్లు ఆఫీసర్లు చెబుతున్నారు. కువైట్​లో ఉంటున్న నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం చిన్నవాల్గోట్ కు  చెందిన గుట్టకింది గంగాధర్ ఇలాగే రిజిస్ట్రేషన్ చేసుకోగా.. తనకు 47,357 సీరియల్​ నంబర్​వచ్చిందన్నారు. ప్రభుత్వం తొలివిడత కింద 15 వేల మందినే తీసుకెళ్తోందని, తన వంతు వచ్చేవరకు ఎన్ని నెలలవుతుందో తెలియడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గల్ఫ్​దేశాల్లో గంగాధర్​లాగే  ఇండియాకు వచ్చేందుకు వేలాది మంది ఎదురుచూస్తున్నారు.

ఇల్లీగల్​గా ఉంటున్నవాళ్లకు తీవ్ర కష్టాలు

కంపెనీ వీసాలపై వెళ్లిన కార్మికులకు లాక్‌డౌన్‌ కారణంగా అక్కడ కొన్ని కంపెనీలు  లేబర్ క్యాంపులు నిర్వహిస్తున్నాయి. వాటిలో సరైన సదుపాయలు లేక.. కార్మికులు అవస్థలు పడుతున్నారు. విజిట్ వీసాలపై వెళ్లి  ఇల్లీగల్‌గా ఉంటున్నవాళ్లు, కంపెనీలు మారి ఖల్లివెల్లి అయినవాళ్ల పరిస్థితి మరీ  దయనీయంగా ఉంది. వీరిలో చాలామంది డ్రైవర్లుగా, హోటళ్లు, రెస్టాwరెంట్లలో వెయిటర్లుగా, షాపింగ్ మాల్స్​లో సేల్స్​మెన్​గా పనిచేస్తున్నారు. ఇక ఇంటి పనులు, వంట పనులు చేసేవారూ పెద్దసంఖ్యలోనే ఉన్నారు. కరోనా కారణంగా ఇలాంటివారి ఉద్యోగాలన్నీ పోయాయి. జీతాలు లేక, రెంట్లు కట్టలేక చాలామంది రోడ్ల మీద పడ్డారు. ఎవరైనా దయతలచి తిండి పెడితే అదే తిని, రోడ్ల పక్కన చెట్ల నీడలో పడుకుంటున్నారు. వందేభారత్ మిషన్ కింద రిజిస్ట్రేషన్ చేసుకొని వెళ్దామన్నా వీరి వద్ద సరైన పత్రాలు లేవు. ప్రభుత్వం స్పందించి తమలాంటివారిని ఇండియాకు తీసుకెళ్లాలని వేడుకుంటున్నారు.

ఫ్లైట్లు లేవని ఆపేస్తున్నరు

కరోనా ఎఫెక్ట్​తో గల్ఫ్​ దేశాల్లో వేలమంది కార్మికులు ఉపాధి కోల్పోయారు. రూంలు లేక, తిండిలేక ఇబ్బందులు పడుతున్నారు. ఎమర్జెన్సీ కోసం బయటికి వచ్చినా రూ. 2 లక్షలు ఫైన్‍ వేస్తున్నారు. ఇప్పటికే చాలా మందికి ఫైన్‍ పడటంతో అవి కట్టేందుకు కూడా డబ్బులు లేక బాధలు పడుతున్నారు. సమస్యను ఇండియా ఎంబసీ దృష్టికి తీసుకెళ్లాం. ఇంటికి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నప్పటికీ ఫ్లైట్లు‍ లేవని ఆపేస్తున్నారు. డబ్బులు లేనివారికి ఆన్​లైన్  ద్వారా  మేమే అప్లై చేయిస్తున్నాం. తెలంగాణ నుంచి సుమారు 5 లక్షల మంది కార్మికులు ఉంటారు. ఇందులో ఇప్పటికే చాలా మంది రోడ్డున పడ్డారు. పనుల్లేక కార్మికులను కంపెనీలు తీసుకోవడం లేదు. సౌదీలో చనిపోయిన వాళ్ల డెడ్‍ బాడీలు కూడా ఇంకా హాస్పిటల్స్​లోనే ఉన్నాయి. ఇండియాకు పోదామని అప్లై చేసుకునేవారికి టికెట్‍ డబ్బులు కూడా లేవు. అంతకుముందు రూ.15 వేలు టికెట్‍ ఉంటే ఇప్పుడు రూ. 25 వేలు తీసుకుంటున్నారు.

– లక్ష్మణ్‍, గల్ఫ్​ కార్మికుల
అవగాహన వేదిక ఉపాధ్యక్షుడు

తిండికి తిప్పలైతున్నది

రెండేండ్ల నుంచి సౌదీలో ఉంటున్న. మార్చిలో ఇంటికి వచ్చేదుండె. కరోనాతో  చిక్కుకుపోయిన. 2 నెలల నుంచి పనుల్లేవు. తిండికీ తిప్పలైతున్నది. ఇంటికి పోదామంటే పోనిస్తలేరు. ఇండియాకు వచ్చేందుకు వారం కింద ఆన్​లైన్​లో అప్లై చేసుకున్న. ఫ్లైట్లు వస్తలేవని చెప్పి ఆపేసిండ్రు.

– గణేశ్‌, పల్లికొండ,
భీంగల్‍ మండలం, నిజామాబాద్‍ జిల్లా

ప్రభుత్వం ఆదుకోవాలి

మస్కట్  కంపెనీలో పనిలేక జీతం ఇవ్వకపోతే 4 ఏండ్ల కింద బయటకు వచ్చి దొరికిన పనిచేసుకుంటున్న. కరోనా వల్ల పనిలేదు.. తినడానికి తిండీ లేదు. ఎన్జీవోలు ఇచ్చే ఆహారంతోనే బతుకు ఎల్తున్నది. రాష్ట్ర ప్రభుత్వం దయతలచి మమ్మల్ని
ఇండియాకు తీసుకెళ్తే ఆడ్నే పని చేసుకుంట.

– బుఖ్య దేవా, నామపూర్ తండా,
ముస్తాబాద్ మండలం, రాజన్న సిరిసిల్ల జిల్లా