హైదరాబాద్ నుంచి డల్లాస్‌కు నేరుగా విమాన సర్వీసులు
వినోద్‌ను కోరిన అమెరికా చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులు
డల్లాస్: దక్షిణ అమెరికా ప్రాంతాలకు తెలంగాణ నుంచి ఫార్మా ఉత్పత్తులు సరఫరా చేయాలని రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్‌ను అమెరికా చాంబర్ ఆఫ్ కామర్స్ డల్లాస్, ఫోర్ట్ వర్త్ శాఖ ప్రతినిధులు కోరారు. అమెరికా పర్యటనలో ఉన్న వినోద్ కుమార్ బుధవారం డల్లాస్ చేరుకున్నారు. ఈ సందర్భంగా అమెరికా చాంబర్ ఆఫ్ కామర్స్ డల్లాస్, ఫోర్ట్ వర్త్ అధ్యక్షులు నీల్ గోనుగుంట్ల నేతృత్వంలోని ప్రతినిధుల బృందం వినోద్ కుమార్‌తో సమావేశమైంది. ఈ సమావేశంలో పలు అంశాలపై ఇష్టాగోష్ఠిగా చర్చించారు.
దక్షిణ అమెరికాలో భారత సంతతికి చెందిన వారు పెద్ద సంఖ్యలో స్థిర పడ్డారని, వారంతా తెలంగాణ ఫార్మా ఉత్పత్తులను ఎక్కువగా ఇష్టపడతారని అమెరికా చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులు వినోద్ కుమార్‌కు తెలియజేశారు. ఎయిర్ ఇండియా కార్గో విమాన సర్వీసుల ద్వారా తెలంగాణ ఫార్మా ఉత్పత్తులను డల్లాస్, ఫోర్ట్ వర్త్‌తో పాటు దక్షిణ అమెరికాకు సరఫరా చేసేందుకు చర్యలు తీసుకోవాలని వారు వినోద్ కుమార్‌ను కోరారు.
అంతే కాకుండా డల్లాస్, ఫోర్ట్ వర్త్, దక్షిణ అమెరికాలో తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎక్కువ సంఖ్యలో నివాసం ఉంటున్నందున హైదరాబాద్ నుంచి డల్లాస్‌కు నేరుగా విమాన సర్వీసులు ప్రారంభించడానికి కృషి చేయాలని వారు వినోద్‌ను కోరారు. మూడు సార్లు పార్లమెంటు సభ్యులుగా పనిచేసిన అనుభవంతో పాటూ.. కేంద్రంలో ఉన్న పలుకుబడిని ఉపయోగించి తమ విజ్ఞప్తిని సాకారం చేయాలని కోరుతూ వినోద్‌కు వారు వినతి పత్రాన్ని అందజేశారు.
కేంద్ర ప్రభుత్వం త్వరలో పార్లమెంట్‌లో చేయనున్న నూతన విద్యా విధాన చట్టం-2019తో ఇప్పటి వరకు విదేశీ యూనివర్శిటీలకు దేశంలో ఉన్న నిషేధం తొలగిపోనుందని వారు అన్నారు. ఇది తెలంగాణకు మహర్దశ కలిగించనుందని అమెరికా చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులు అభిప్రాయపడ్డారు. తెలంగాణలో అమెరికా యూనివర్శిటీల ఏర్పాటుకు తమ పూర్తి సహకారాన్ని అందిస్తామని వారు వినోద్ కుమార్‌కు హామీ ఇచ్చారు.
అమెరికా చాంబర్ ఆఫ్ కామర్స్ డల్లాస్, ఫోర్ట్ వర్త్ ప్రతినిధులు చేసిన విజ్ఞప్తిని సాకారం చేసేందుకు కృషి చేస్తానని బోయినపల్లి వినోద్ కుమార్ వారికి హామీ ఇచ్చారు. దక్షిణ అమెరికాకు హైదరాబాద్ నుంచి ఫార్మా ఉత్పత్తులను సరఫరా చేసేందుకు ప్రభుత్వంతో చర్చిస్తానని ఆయన వారికి హామీ ఇచ్చారు. ఈ ఇష్టాగోష్ఠిలో ఎన్నారై తెలంగాణ ప్రతినిధులు డాక్టర్ దేవయ్య, దయాకర్ పుష్కూర్ తదితరులు పాల్గొన్నారు.
