- ముంబై హైస్పీడ్ రైలు మార్గానికి డీపీఆర్ సిద్ధం
- సీఎస్ కె. రామకృష్ణారావు
హైదరాబాద్, వెలుగు: దేశంలోనే రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలిపే ‘తెలంగాణ రైజింగ్ 2047’ ఆర్థిక వృద్ధి కారిడార్ సాకారంలో ప్రతిపాదిత హైస్పీడ్ రైలు ప్రాజెక్టులు అత్యంత కీలక పాత్ర పోషించనున్నాయని సీఎస్ కె.రామకృష్ణారావు తెలిపారు. శుక్రవారం సెక్రటేరియెట్‌లో హైదరాబాద్ కేంద్రంగా సాగనున్న హైస్పీడ్ రైలు కారిడార్లపై సంబంధిత శాఖల ఉన్నతాధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. సీఎస్ మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం, కేంద్ర రైల్వే శాఖ సంయుక్తంగా చేపడుతున్న ఈ మెగా ప్రాజెక్టుల ప్రతిపాదనలను సిద్ధం చేయాలని ఆదేశించారు. దేశంలోనే అత్యంత వేగవంతమైన రవాణా వ్యవస్థగా ఈ ప్రాజెక్టులు నిలుస్తాయని.. పారిశ్రామిక, ఐటీ, పర్యాటక రంగాల అభివృద్ధికి, ప్రజల భవిష్యత్ అవసరాలకు ఇవి ఉపకరిస్తాయని పేర్కొన్నారు.
ప్రాజెక్టుల అమలు, భూసేకరణ, మౌలిక వసతుల కల్పనలో ఆర్ అండ్ బీ, హెచ్ఎండీఏ, ఎయిర్ పోర్టు అథారిటీ సహా అన్ని శాఖలు పరస్పర సమన్వయంతో కదలాలని స్పష్టం చేశారు. హైదరాబాద్–పూణే–ముంబై మార్గానికి సంబంధించిన సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) సిద్ధమైనట్లు రైల్వే అధికారులు వెల్లడించారు. సుమారు 671 కిలోమీటర్ల పొడవున్న ఈ ముంబై కారిడార్‌కు తెలంగాణ పరిధిలో 93 కిలోమీటర్ల భూసేకరణ అవసరమవుతుందని తెలిపారు. హైదరాబాద్–బెంగళూరు, హైదరాబాద్–చెన్నై కారిడార్లకు సంబంధించి రాష్ట్రంలో సుమారు 123 కిలోమీటర్ల నిడివిలో భూమిని సేకరించాల్సి ఉంటుందని, కోకాపేట, శంషాబాద్ ప్రాంతాలలో రైల్వే డిపోల ఏర్పాటుకు సైతం స్థలాలు అవసరమని వివరించారు.
