రిటైర్డ్ ఆర్టీసీ ఉద్యోగుల బకాయిలు చెల్లించాలి : తెలంగాణ ఆర్టీసీ రిటైర్డ్ ఆఫీసర్స్ వెల్ఫేర్ అసోసియేషన్

రిటైర్డ్ ఆర్టీసీ ఉద్యోగుల బకాయిలు చెల్లించాలి : తెలంగాణ ఆర్టీసీ రిటైర్డ్ ఆఫీసర్స్ వెల్ఫేర్ అసోసియేషన్

బషీర్‌‌‌‌బాగ్,వెలుగు : తెలంగాణలో ఆర్టీసీ లాభాల బాటలో నడుస్తోందని ప్రభుత్వం, యాజమాన్యం చెబుతున్నప్పటికీ పదవీ విరమణ చేసిన అధికారులు, ఉద్యోగులు, కార్మికులకు రావాల్సిన రిటైర్మెంట్ ప్రయోజనాల చెల్లింపులో ఘోరంగా విఫలమైందని తెలంగాణ ఆర్టీసీ రిటైర్డ్ ఆఫీసర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ విమర్శించింది. రిటైర్మెంట్ అనంతరం రావాల్సిన బకాయిల కోసం వేలాది మంది ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్నా పట్టించుకోవడం లేదని, ఈ నిరీక్షణలోనే ఇప్పటికే సుమారు 400 మంది మృతి చెందారని ఆవేదన వ్యక్తం చేసింది. హైదరాబాద్ బషీర్‌‌‌‌బాగ్ ప్రెస్‌‌‌‌క్లబ్‌‌‌‌లో ఆదివారం నిర్వహించిన సమావేశంలో అసోసియేషన్ అధ్యక్షుడు ఎం.వి. రాఘవేంద్రరావు, ప్రధాన కార్యదర్శి వెంకట్‌‌‌‌రెడ్డి, ఉపాధ్యక్షుడు కొమరయ్య మాట్లాడారు. 

గత నాలుగేళ్లలో పదవీ విరమణ చేసిన సుమారు 17 వేల మంది అధికారులు, ఉద్యోగులు, కార్మికులకు రూ.871 కోట్ల మేర రిటైర్మెంట్ ప్రయోజనాలు చెల్లించాల్సి ఉన్నప్పటికీ ఆర్టీసీ యాజమాన్యం ఇప్పటికీ వాటిని విడుదల చేయలేదని ఆరోపించారు. బయటకు మాత్రం ఆర్టీసీ లాభాల్లో ఉందని ప్రచారం చేస్తూ, పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు రావాల్సిన హక్కులను నిర్లక్ష్యం చేస్తున్నారని విమర్శించారు. గతంలో ఆర్టీసీ ఆర్థిక సంక్షోభంలో ఉందని చెప్పారని, ఇప్పుడు లాభాల బాటలో ఉందని చెబుతున్న నేపథ్యంలో రిటైర్డ్ ఉద్యోగుల బకాయిలు ఎందుకు చెల్లించడం లేదని ప్రశ్నించారు. ఆర్టీసీ స్వయం ప్రతిపత్తి గల సంస్థ అయినప్పటికీ ప్రభుత్వ నిర్ణయాల ప్రకారమే నడుస్తోందని పేర్కొన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం కింద ప్రభుత్వం చెల్లించాల్సిన మొత్తాలను ప్రతి నెల పూర్తిగా ఆర్టీసీకి విడుదల చేయడం లేదని ఆరోపించారు. 

అలాగే ఆర్టీసీని దశలవారీగా ప్రైవేటీకరిస్తున్నారని, ప్రస్తుతం నడుస్తున్న ఎలక్ట్రిక్ బస్సులు ఎక్కువగా ప్రైవేటు సంస్థలవేనని తెలిపారు. గ్రాట్యుటీ, లీవ్ ఎన్‌‌‌‌క్యాష్‌‌‌‌మెంట్, సవరించిన వేతన స్కేలు బకాయిలు, పీఎఫ్‌‌‌‌తో పాటు రిటైర్డ్ ఉద్యోగులకు రావాల్సిన అన్ని ప్రయోజనాలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. గతంలో అమల్లో ఉన్నట్లుగా పదవీ విరమణ చేసిన రోజునే వీడ్కోలు కార్యక్రమంలో అన్ని చెల్లింపులు చేసే విధానాన్ని తిరిగి అమలు చేయాలని కోరారు. ముఖ్యమంత్రి రేవంత్‌‌‌‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క జోక్యం చేసుకుని రిటైర్డ్ ఉద్యోగులకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.