- ఎయిర్ పోర్టులను తలపించేలా తీర్చిదిద్దేందుకు ఆర్టీసీ కార్యాచరణ
- 364 బస్టాండ్లలో ల్యాండ్ స్కేపింగ్పనులకు నిర్ణయం
హైదరాబాద్, వెలుగు: ప్రయాణికులను ఆకట్టుకునేందుకు రాష్ట్రంలోని బస్ స్టేషన్లను పచ్చదనం ఉట్టిపడేలా అందంగా తీర్చిదిద్దేందుకు ఆర్టీసీ యాజమాన్యం సిద్ధమైంది. ఎయిర్‌పోర్టులను తలపించేలా బస్టాండ్లను ఆహ్లాదకరంగా మార్చేందుకు ఉన్నతాధికారులు కార్యాచరణ రూపొందించారు. 3 రోజుల క్రితం జరిగిన ఆర్టీసీ బోర్డు సమావేశంలో ఈ అంశంపై చర్చించి, అన్ని బస్ స్టేషన్లలో ల్యాండ్‌స్కేపింగ్ పనులను వెంటనే ప్రారంభించాలని నిర్ణయించారు.
రాష్ట్రంలో మొత్తం 364 బస్టాండ్లు ఉండగా.. విడతల వారీగా ప్రతి స్టేషన్‌ను అందంగా, ఆకర్షణీయంగా, పచ్చదనం ఉట్టిపడేలా తీర్చిదిద్దాలని భావిస్తున్నారు. ఇందులో భాగంగా రంగురంగుల పూల మొక్కలు, గ్రీనరీ ఏర్పాటుకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు. దీనికి సుమారు రూ. 20 కోట్ల వరకు ఖర్చు అవుతుందని అంచనా వేసి, సంబంధిత ప్రతిపాదనలకు బోర్డు అనుమతి పొందారు. బస్సులు ఆలస్యమైనా ప్రయాణికులు అసహనం చెందకుండా బస్టాండ్లలో ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు.
ముఖ్యంగా ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్ల వద్ద ప్రత్యేక లైటింగ్ సౌకర్యం, ఐ లవ్ యూ ఆర్టీసీ అనే డిస్‌ప్లే బోర్డులు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అదనంగా సౌకర్యవంతమైన సీటింగ్, ఆధునిక వసతులతో కూడిన వాష్‌రూమ్‌లను ఏర్పాటు చేయనున్నారు.
