సర్కార్ బడుల్లోని లైబ్రరీలకు నిధులు...1,138 స్కూళ్లకు రూ.15 వేల చొప్పున ఫండ్స్

సర్కార్ బడుల్లోని లైబ్రరీలకు నిధులు...1,138 స్కూళ్లకు రూ.15 వేల చొప్పున ఫండ్స్

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని సర్కారు బడుల్లోని విద్యార్థులకు పుస్తక పఠనంపై ఆసక్తి పెంచేందుకు, విజ్ఞానాన్ని అందించేందుకు సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. విద్యాశాఖ పరిధిలోని 1,138 బడుల్లోని లైబ్రరీలను బలోపేతం చేసేందుకు నిర్ణయం తీసుకుంది. ఒక్కో స్కూల్​కు రూ.15 వేల చొప్పున సాంక్షన్ చేసింది. ఈ మేరకు విద్యాశాఖ కార్యదర్శి డాక్టర్ యోగితారాణా ఉత్తర్వులు జారీ చేశారు. 

జిల్లా గ్రంథాలయ సంస్థల వద్ద ఉన్న నిధులను వినియోగించి ఈ లైబ్రరీలను ఆధునీకరించనున్నారు. ఎంపిక చేసిన 1,138 బడుల్లో లైబ్రరీ గదులకు మరమ్మతులు చేయడం, పెయింటింగ్, అవసరమైన రీడింగ్ టేబుళ్లు, కుర్చీలు, బుక్ రాక్స్, అల్మారాలు, ఫ్యాన్లు, లైట్ల ఏర్పాటు కోసం ఒక్కో బడికి రూ.15 వేలు చొప్పున వన్ టైమ్ గ్రాంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా మంజూరు చేశారు. దీనికోసం రాష్ట్రవ్యాప్తంగా మొత్తం రూ.1.70 కోట్లు వెచ్చించనున్నారు. 

నెలకు రూ.వెయ్యితో పేపర్లు, పుస్తకాలు.. 

కేవలం వసతులు కల్పించడమే కాకుండా విద్యార్థులకు నిత్యం లోకజ్ఞానం అందించేందుకు వీలుగా ప్రతినెలా పత్రికలు, మేగజైన్లు కొనుగోలు చేసేందుకు ఒక్కో పాఠశాలకు రూ.వెయ్యి చొప్పున కేటాయించారు. ఏయే పేపర్లు, పుస్తకాలు కొనుగోలు చేయాలనేది హెడ్మాస్టర్లు, టీచర్లు, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ సభ్యులు, స్టూడెంట్ కౌన్సిల్ సభ్యులతో కూడిన కమిటీ నిర్ణయిస్తుంది.