‘సర్పంచ్ సంవాద్’ లో మల్లారానికి ఫస్ట్ప్రైజ్...చీపూర్ సర్పంచ్ కు ద్వితీయ బహుమతి

‘సర్పంచ్ సంవాద్’ లో మల్లారానికి ఫస్ట్ప్రైజ్...చీపూర్ సర్పంచ్ కు ద్వితీయ బహుమతి
  •     జాతీయ స్థాయి పోటీల్లో మెరిసిన తెలంగాణ పల్లెలు​

హైదరాబాద్, వెలుగు: పల్లెల్లో టెక్నాలజీని వాడుకోవడంలో తెలంగాణ సర్పంచ్​లు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నారు. సర్పంచ్ సంవాద్ డిజిటల్​ప్లాట్​ఫామ్ ఆధ్వర్యంలో డిజిటల్ కృషి - సమృద్ధి గావ్ థీమ్‌‌‌‌‌‌‌‌తో నిర్వహించిన జాతీయ పోటీల్లో మన సర్పంచ్​లు సత్తా చాటారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలం మల్లారం సర్పంచ్ సంగం అర్పిత వీరారెడ్డి దేశంలోనే నంబర్ 1 స్థానాన్ని కైవసం చేసుకొని ఫస్ట్​ప్రైజ్​గెలుచుకున్నారు. నిజామాబాద్‌‌‌‌‌‌‌‌ జిల్లాకు చెందిన చీపూర్ సర్పంచ్ సారంగి శాంతి కుమార్ ద్వితీయ బహుమతి సాధించగా, హర్యానాకు చెందిన అజయ్ కుమార్ మూడో స్థానంలో నిలిచారు.  అయితే, మల్లారం గ్రామాన్ని డిజిటల్ మోడల్ విలేజ్‌‌‌‌‌‌‌‌గా మార్చడంలో సర్పంచ్ అర్పిత కుమారుడు, యువ ఇన్నోవేటర్ సంగం సంహిత్ రెడ్డి కీలక పాత్ర పోషించారు. 

మల్లారం పంచాయతీ కోసం ఆయన ప్రత్యేకంగా వెబ్‌‌‌‌‌‌‌‌సైట్‌‌‌‌‌‌‌‌ను www.mallaramgramapanchayat.com రూపొందించారు. రైతులకు సాగు సమాచారం, ప్రభుత్వ పథకాలు, పారదర్శక పాలన.. ఇలా అన్ని సేవలను ఒకేచోట డిజిటల్ రూపంలో అందించడం అధికారులను విశేషంగా ఆకర్షించింది. ఈ సందర్భంగా సర్పంచ్ అర్పిత మాట్లాడుతూ.. జాతీయ స్థాయిలో ప్రథమ బహుమతి రావడం తన గ్రామానికి దక్కిన గౌరవమని సంతోషం వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా వందలాది మంది పోటీ పడగా.. తొలి రెండు స్థానాల్లో తెలంగాణ వాళ్లే నిలవడంపై సర్వత్రా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.