గందర గోళంగా సెక్రటేరియెట్‌‌ షిఫ్టింగ్

గందర గోళంగా సెక్రటేరియెట్‌‌ షిఫ్టింగ్

సెక్రటేరియెట్ తరలింపు గందరగోళంగా తయారైంది. వివిధ శాఖల ఆఫీసులను ఎక్కడికి తరలిస్తున్నారన్నది అయోమయంగా ఉంది. ఆగమాగంగా వీటిని షిఫ్ట్ చేయాలని ప్రభుత్వం తొందర పెడుతుండటంతో‌‌‌‌ఉద్యోగులు హడావుడి పడుతున్నారు. పాలన పక్కన పెట్టి సెక్రటేరియెట్‌‌లోని అన్ని బ్లాక్​ల్లో అధికారులు, ఉద్యోగులు‌‌‌‌ఫైళ్లు సర్దడం, మూటలు కట్టుకోవడంలో బిజీగా మారారు. దీంతో వారం రోజులుగా సెక్రటేరియెట్ లో పాలనా వ్యవహారాలన్నీ అనధికారికంగా ఆగిపోయాయి. ఇప్పటివరకు అన్ని శాఖలు సెక్రటేరియెట్‌‌లో ఒకే దగ్గర ఉన్నాయి. సీఎం కార్యాలయంతో పాటు సీఎంవో కార్యదర్శులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారులు, రాష్ట్ర మంత్రుల ఛాంబర్లు, పేషీలు, ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులు, సంబంధిత శాఖల సిబ్బంది ఆఫీసులన్నీ ఇక్కడే ఉన్నాయి. వీటిని తాత్కాలికంగా మరోచోటుకి మార్చాలంటే భారీ కసరత్తు జరగాలి. కానీ ప్రభుత్వం అలాంటి ప్లానింగ్ లేకుండానే ఏర్పాట్లు వేగవంతం చేసింది. దీంతో ఉద్యోగులు నానా హైరానా పడుతున్నారు. ఇప్పటివరకు అధికారికంగా ఉత్తర్వులేమీ జారీ చేయకుండానే.. ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడికి ఆఫీసులను తరలించేలా అంతర్గతంగా షిప్టింగ్ ప్లాన్‌‌ను అమల్లో పెట్టింది. దీంతో‌‌‌‌ చెట్టుకొకటి పుట్టకొకటిలా సెక్రెటేరియెట్‌‌లోని ఆఫీసులన్నీ దిక్కులేనట్లుగా అట్నుంచి ఇటు.. ఇట్నుంచి అటు చెల్లాచెదురవనున్నాయి. రెండు వారాల్లో  శాఖల తరలింపు పూర్తి కావాలని సీఎం ఆదేశాలు జారీ చేసినట్లు అధికారుల్లో చర్చ జరుగుతోంది.  ప్రధానమైన శాఖలను బీఆర్కే భవన్ కు, సమీపంలోని ఆదర్శ్ నగర్ ఎమ్మెల్యే క్వార్టర్స్ కు లేదా గగన్ విహార్ కు తరలించేందుకు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ అక్కడున్న ఆఫీసులు ఎక్కడికి పంపించాలనే విషయంలో కసరత్తు జరగలేదు. దీంతో గందరగోళం గజిబిజిగా ఉందని అధికారులే తలలు పట్టుకుంటున్నారు.

ఏ ఆఫీసు ఎక్కడికి?

ప్రస్తుతం సచివాలయంలో 29 శాఖలు ఉండగా వాటిలో మెజారిటీ శాఖలను బీఆర్కే భవన్ కు తరలించాలని నిర్ణయించారు. మిగతా వాటిని ఆయా శాఖల కమిషనరేట్లకు షిప్ట్ చేస్తున్నారు.  సీఎం ఆఫీసుతోపాటు సీఎంవో, సీఎస్ కార్యాలయం, సాధారణ పరిపాలన శాఖ (జీఏడీ), ఫైనాన్స్‌‌, ప్లానింగ్‌‌, న్యాయ శాఖలను బీఆర్కే భవన్​కు తరలించనున్నారు. వీటిని సర్దుబాటు చేయాలంటే కనీసం ఐదు ఫ్లోర్లు అవసరం. ఇటీవల బీఆర్కే భవన్​లో ఉన్న ఆఫీసులను ఏపీ ప్రభుత్వం ఖాళీ చేసింది. దీంతో  అక్కడ  8,9వ ఫ్లోర్లు ఖాళీగా ఉన్నాయి. కానీ మిగతా ఆఫీసులను ఎక్కడికి మార్చాలనేది ఖరారు కాలేదు.  ఖాళీగా ఉన్న ఆఫీసులకు వెళ్లాలని అక్కడున్న కార్యాలయాల అధికారులపై ఉన్నతాధికారులు ఒత్తిడి పెంచారు. ఇందులో భాగంగా మంగళవారం 7వ ఫ్లోర్ లో ఉన్న సాంకేతిక విద్యా మండలి కార్యాలయాన్ని మసాబ్ ట్యాంక్ కు తరలించారు. మిగతా ఆఫీసులు ఎటు వెళ్తాయనేది ఇంకా తేలలేదు.  మిగతా శాఖలను నాంపల్లిలోని గగన్ విహార్, ఆదర్శ్ నగర్ లోని ఎమ్మెల్యే క్వార్టర్స్ తరలించాలని సూత్రప్రాయంగా నిర్ణయించినట్లు తెలుస్తోంది. అటవీ శాఖను అరణ్య భవన్ , రోడ్లు భవనాలు, రవాణా శాఖను ఎర్రమంజిల్ లోని ఈఎన్‌‌సీ ఆఫీస్‌‌కు, నీటిపారుదల శాఖను జలసౌధకు, వ్యవసాయ శాఖను బషీర్ బాగ్ లోని ఆ శాఖ కమిషనరేట్ కు , విద్యా శాఖను నిజాం కాలేజీ సమీపంలోని ఎస్సీఆర్టీ భవనానికి తరలించనున్నారు.

కీలక ఫైళ్లు ఎట్ల తరలిస్తరో?

శాఖల షిప్టింగ్ సమయంలో ఫైళ్ల తరలింపు కీలకాంశంగా మారింది. అన్ని ఫైళ్లను మూట గట్టి షిప్ట్ అయిన తర్వాత అక్కడ సర్దుబాటు చేయనున్నారు. రాష్ట్ర విభజన తర్వాత ప్రభుత్వం తెచ్చిన సంక్షేమ పథకాలు, నీటి పారుదల ప్రాజెక్టులు, విద్యుత్, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, సీఎంఆర్ఎఫ్, ఆరోగ్యశ్రీ, ధరణి, మీసేవ, మాభూమి, రెవెన్యూ, ట్రెజరీ, ఎక్సైజ్ తో పాటు విభజన చట్టం, 9,10 వ షెడ్యూల్‌‌లో ఉన్న సంస్థల విభజన వంటి కీలక ఫైళ్ల తరలింపు, భద్రతపై సందేహాలొస్తున్నాయి. ఫైళ్లు తరలించే టైంలో, కొత్తప్లేస్ లో సర్దే టైంలో మిస్ అయితే ఎవరు బాధ్యత వహిస్తారని పలువురు అంటున్నారు. డిపార్ట్‌‌మెంట్లు తరలించాక ఏ పైల్ ఎక్కడుందో తెలుసుకోడానికి చాలా టైం పడుతుందని అధికారులంటున్నారు.

కుదురుకునేందుకు రెండేండ్లు

సెక్రటేరియెట్‌‌ కూల్చివేతకు చాలా టైం పడుతుందని ఆర్‌‌అండ్‌‌బీ అధికారులు చెబుతున్నారు. అన్ని బ్లాకులు ఓకేసారి కూల్చేయాలా? దశల వారీగా కూల్చివేయాలా అన్న దానిపై ప్రభుత్వం ఎటు తేల్చుకోలేకపోతోంది. ఇక దసరా వరకు మంచి రోజులు లేకపోవటంతో ఆ తర్వాతే కొత్త సెక్రటేరియెట్ నిర్మాణ పనులు షురూ అయ్యే అవకాశాలు కన్పిస్తున్నాయి. కొత్త సెక్రటేరియెట్‌‌ను 9 నుంచి 12 నెలల్లో పూర్తి చేయాలని, వచ్చే ఉగాది కల్లా పూర్తి చేసి జూన్ 2న రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రారంభించాలని సీఎం కేసీఆర్ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే వర్షాలతో పనులు ఆలస్యమయ్యే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఏడాదిలో నిర్మాణం పూర్తి చేయాలనుకున్నా మరో 6 నెలలు అదనంగా పట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కొత్త సెక్రటేరియెట్‌‌ ప్రారంభమైనా శాఖలన్నీ సర్దుబాటు చేయటానికి మరికొంత టైం పడుతుందని అంచనా. మొత్తంగా రెండేళ్ల పాటు రాష్ట్ర ప్రభుత్వ పాలనకు అడ్డంకులు ఏర్పడుతాయని ఉద్యోగులు చెబుతున్నారు.

బీఆర్కే భవన్‌‌కు ఓఎఫ్సీ కేబుల్‌‌

ఇప్పుడున్న సెక్రటేరియెట్‌‌లోని డీ బ్లాక్ లో డేటా సెంటర్ ఉంది. ఇక్కడ ప్రతి శాఖకు సంబంధించి లాగిన్ ఐడీ, పాస్ వర్డ్ ఇవ్వటంతో జీవోలు అప్ లోడ్ చేస్తున్నారు. అన్ని శాఖలు ఒకే దగ్గర ఉండటంతో ఇది సాధ్యమైంది.  ప్రధాన డేటా సెంటర్ గచ్చిబౌలిలోని టీఎస్ ఐఐసీ ఆఫీసులో కొనసాగుతోంది. అక్కడి నుంచి సెక్రటేరియెట్ కు ఓఎఫ్సీ కేబుల్ సదుపాయం ఉంది. ఇప్పుడు జీఏడీ, సీఎంవో, ఆర్థిక, ప్రణాళికతో పాటు మరికొన్ని శాఖలు ఉండే బీఆర్కే భవన్ కు ఓఎఫ్సీ కేబుల్ ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది. రోజూ విడుదల చేసే జీవోలూ ఆలస్యం అవనున్నట్టు తెలుస్తోంది. డీ బ్లాక్ లోని డేటా సెంటర్ నూ బీఆర్కే భవన్ లో ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది.

పెరగనున్న తిరుగుడు

ఇప్పుడు అన్ని శాఖలు ఒక్క దగ్గర ఉండడంతో మంత్రుల సమీక్షలకు, ముఖ్య కార్యదర్శులను కలిసేందుకు జిల్లా కలెక్టర్లు, ఇతర అధి కారులు, ఉద్యోగులకు ఇబ్బంది ఉండేది కా దు. ఇప్పుడు ఒక్కో శాఖ ఒక్కో దగ్గర షిప్ట్ చేస్తుండటంతో వారు ఇబ్బంది పడనున్నారు. రెండు, మూడు శాఖలకు వెళ్లాలంటే జనానికి టైంతోపాటు డబ్బు కూడా ఖర్చయ్యే అవకాశం ఉంది. రోజూ మధ్యాహ్నం 3, 4  గంటల టైంలో సీఎంఆర్ఎఫ్ , ఇతర పనులకు వచ్చే సాధారణ జనానికి ఇబ్బంది తప్పదని అంటున్నారు.

ఫైళ్ల సర్క్యులేషన్ లో ఆలస్యం

ప్రస్తుతం సెక్రటేరియెట్‌‌లో ఒక డిపార్ట్‌‌మెంట్‌‌ నుంచి మరో శాఖకు ఫైల్ వెళ్లి రావటానికి ఒక రోజు పడుతుందని ఆర్‌‌అండ్‌‌బీ శాఖకు చెందిన ఓ ఉన్నతాధికారి తెలిపారు. టప్పాల్ సెక్షన్ ద్వారా 10 నిమిషాల్లో ఒక శాఖ నుంచి మరో శాఖకు ఫైల్ వెళ్తోంది. ఇప్పుడు ఒక్కో శాఖను సిటీలోని ఒక్కో చోటుకు తరలిస్తుండటంతో ఒక్కో ఫైల్ వెళ్లి తిరిగి రావటానికి చాలా టైం పట్టే అవకాశం ఉంది. శాఖల తరలింపుపై ప్రభుత్వం ప్రచారం చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఏ శాఖను ఎక్కడకు తరలిస్తున్నామన్న విషయమై అన్ని జిల్లాలకు జీఏడీ అధికారులు లేఖ రాయటంతో పాటు ప్రస్తుత సెక్రటేరియెట్ దగ్గర డిస్ ప్లే బోర్డులు ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం . కొత్త ప్లేస్‌‌లలో కూడా శాఖలకు సంబంధించిన వివరాలతో డిస్ ప్లే బోర్డులు ఏర్పాటు చేయటంతో పాటు పత్రికల్లో ప్రకటనలు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.

ఏ డిపార్ట్‌‌మెంట్‌‌ ఎక్కడికి?

శాఖ                                                            తరలించే ప్రదేశం

జీఏడీ, సీఎంవో, ఫైనాన్స్‌‌,
ప్లానింగ్‌‌, న్యాయశాఖ, హోం శాఖ                         బీఆర్కే భవన్

రోడ్లు భవనాలు, రవాణా శాఖ             ఎర్రమంజిల్ ఈఎన్సీ ఆఫీస్

ఫారెస్ట్‌‌                                            అరణ్య భవన్

విద్యుత్                                       విద్యుత్ సౌధ, ఖైరతాబాద్

అగ్రికల్చర్‌‌                                    వ్యవసాయ శాఖ కమిషనరేట్ ఆఫీస్, బషీర్ బాగ్

విద్యాశాఖ                                    ఎస్సీఆర్టీ బిల్డింగ్,  బషీర్ బాగ్

పంచాయతీ రాజ్                                   రంగారెడ్డి జిల్లా పరిషత్

హౌసింగ్                                        గృహనిర్మాణ శాఖ కార్యాలయం, హిమాయత్ నగర్

రెవెన్యూ                                    స్టాంప్స్ & రిజిస్ట్రేషన్ కార్యాలయం, ఎంజే మార్కెట్

మున్సిపల్ , పట్టాణాభివృధ్ది                 మెట్రో రైల్ బిల్డింగ్,  బేగంపేట