నిజాలు మాట్లాడితే బెదిరిస్తున్నరు: భట్టి విక్రమార్క

నిజాలు మాట్లాడితే బెదిరిస్తున్నరు: భట్టి విక్రమార్క

ఢిల్లీ పోలీసులను బీజేపీ తన ఆధీనంలో ఉంచుకున్నది: భట్టి విక్రమార్క 

    సీఎంను కూడా ఢిల్లీకి రమ్మంటున్నరు.. ఇదేనా భావప్రకటనా స్వేచ్ఛ?
    రిజర్వేషన్లు కాపాడుకునేందుకు రాహుల్ కృషి
    బీఆర్ఎస్, బీజేపీ ముసుగు తొలగిపోయింది.. ఆ రెండు పార్టీలు​ ఒక్కటే 
    కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చడం ఎవరి తరం కాదు.. పూర్తికాలం పవర్​లో ఉంటాం
    ఇక్కడి వనరులు, సంపదను ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు పంచుతామని వెల్లడి

హైదరాబాద్, వెలుగు:  కేంద్రంలోని దర్యాప్తు ఏజెన్సీలను, ఢిల్లీ పోలీసులను మోదీ సర్కారు, బీజేపీ తమ ఆధీనంలో ఉంచుకున్నదని, నిజాలు మాట్లాడుతున్న వారిపై బెదిరింపులకు దిగుతోందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ధ్వజమెత్తారు. ఎస్సీ, ఎస్టీ, బీసీల రిజర్వేషన్లను కాపాడుకునేందుకు బీజేపీ కుట్రలను బయటపెట్టిన సీఎం రేవంత్ పై ఢిల్లీ పోలీసులు కేసు పెట్టి.. అక్కడకు రమ్మంటున్నారని మండిపడ్డారు. ఇదేనా భావ ప్రకటనా స్వేచ్ఛ?  అని ప్రశ్నించారు. మంగళవారం గాంధీ భవన్​లో భట్టి విక్రమార్క మీడియా సమావేశంలో మాట్లాడారు. రాజ్యాంగం ప్రసాదించిన భావ ప్రకటన స్వేచ్ఛకు మోదీ సర్కారు విఘాతం కలిగిస్తున్నదని మండిపడ్డారు. బ్రిటిష్ కాలం నాటి రూల్ ను తెరపైకి తెచ్చి బెదిరిస్తున్నదని అన్నారు. ఢిల్లీ సుల్తాన్ల మాదిరిగా పాలిస్తామంటే కుదరదని హెచ్చరించారు. ఈ పదేండ్లలో కొంత మందిని రెండో శ్రేణి పౌరులుగా మార్చారని మోదీ సర్కారుపై భట్టి ఫైర్ అయ్యారు. ఇది మల్టీ పార్టీలు ఉన్న దేశమని, డబుల్ ఇంజిన్ సర్కారు అనడం ఏమిటని బీజేపీని నిలదీశారు. 

ఓటుతోనే బీజేపీకి బుద్ధి చెప్పాలి

ఈ ఎన్నికల్లో ప్రజలు తమ ఓటుతో బీజేపీకి తగిన బుద్ధి చెప్పాలని భట్టి విక్రమార్క పిలుపునిచ్చారు. దేశంలో మరోసారి బీజేపీ అధికారంలోకి రాకుండా చూడాల్సిన బాధ్యత ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, బీసీ వర్గాలపై ఉందన్నారు. మోదీ పాలనలో దేశంలో భయానక వాతావరణం నెలకొన్నదని, అందుకే ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేందుకు, రాజ్యాంగాన్ని రక్షించుకునేందుకు బీజేపీని అధికారంలోకి రానివ్వొద్దని తెలిపారు.  ఎస్సీ, ఎస్టీలకు ఆషామాషీ గా ఈ రిజర్వేషన్లు రాలేదని, గాంధీ, నెహ్రూ, అంబేద్కర్ చేసిన కృషి ఫలితమే ఈ రిజర్వేషన్లని చెప్పారు. ఇప్పుడు వీటిని కాపాడేందుకు  రాహుల్​గాంధీ కృషి చేస్తున్నారని తెలిపారు.

కాంగ్రెస్​తోనే సమాఖ్య స్ఫూర్తి

సమాఖ్య స్ఫూర్తిని కాపాడుకోవాలంటే కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉండడమే ఏకైక మార్గమని భట్టి విక్రమార్క తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు దేశంలో ఉన్న సంపదను పంచినప్పుడే ప్రజాస్వామ్యానికి అసలైన నిర్వచనమని పేర్కొన్నారు. ఈ వర్గాల రిజర్వేషన్లను కాపాడేందుకు రాహుల్ పోరాడుతున్నారని చెప్పారు. ఈ ఎన్నికల్లో బీజేపీ 400 సీట్లు సాధించి.. ఈ వర్గాల రిజర్వేషన్లను రద్దు చేసి, వారిని బానిసలుగా మార్చేందుకు కుట్ర చేస్తున్నదని ఆరోపించారు. ఇందులో భాగంగానే దేశంలో ఎన్నో రాష్ట్రాల్లో  అధికారంలో ఉన్న ఇతర పార్టీలను కూలదోసి అడ్డదారిలో బీజేపీ అధికారంలోకి వచ్చిందని చెప్పారు. ‘‘ఈ దేశం కోసం పుట్టినమని చెప్పుకునే ఆర్ఎస్ఎస్ రిజర్వేషన్లను ఎత్తి వేసేందుకు కుట్ర చేస్తున్నది. క్రోని క్యాపిటలిస్ట్ లుగా చెప్పుకునే కొందరు ఈ వర్గాల రిజర్వేషన్ల ఎత్తివేతను కోరుకుంటున్నరు. తస్మాత్ జాగ్రత్త.. ఈ సమయంలో ప్రతి ఓటు కీలకమే. అందుకే కాంగ్రెస్ గెలుపు అవసరాన్ని గుర్తించాలి”అని  భట్టి పిలుపునిచ్చారు.

ప్రమాదంలో ప్రజాస్వామ్యం

ప్రపంచంలోనే అతిపెద్ద డెమొక్రటిక్​ కంట్రీగా పేరున్న భారత్ లో ఇప్పుడు  ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని భట్టి విక్రమార్క పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, బీసీలు రాజ్యాధికారంలో వాటా కోసం కాంగ్రెస్ ను గెలిపించుకోవాల్సిన అవసరం ఉన్నదని తెలిపారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే దేశంలో ఉన్న సంపదను, వనరులను ఈ వర్గాలకు దక్కేలా చేయడంతో పాటు జనాభా ప్రకారం వారికి రిజర్వేషన్లు అందేలా చూస్తామని చెప్పారు. అందుకే  కుల గణన అని స్పష్టం చేశారు. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ ముసుగు తొలగిపోయిందని, బీజేపీ, బీఆర్ఎస్ కలిసిపోయాయని అన్నారు.

బీజేపీకి కేసీఆర్ వత్తాసు పలకడం సిగ్గుచేటని దుయ్యబట్టారు. రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కారు ను కూల్చడం ఎవరి తరం కాదని, తాము పూర్తికాలం ఉంటామని చెప్పారు. రాష్ట్ర వనరులను, సంపదను కేసీఆర్ పదేండ్లపాటు దోచుకున్నారని ఆరోపించారు. పదేండ్లలో ఛిన్నాభిన్నమైన రాష్ట్రాన్ని కేవలం మూడు నెలల్లోనే తాము చక్క దిద్దామని చెప్పారు.  రాష్ట్రంలో 14 ఎంపీ సీట్లు గెలుచుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ పై పూర్తి రిపోర్ట్ వచ్చిన తర్వాతనే  ముందుకు పోతామని వెల్లడించారు.