- 52 లక్షల ఎకరాల్లో పత్తి
- 66 లక్షల ఎకరాల్లో వరి
- వ్యవసాయ శాఖ వానాకాలం యాక్షన్ ప్లాన్
- విత్తనాలు, ఎరువుల పంపిణీ షురూ
హైదరాబాద్, వెలుగు: రానున్న వానాకాలం సీజన్‌లో రాష్ట్రవ్యాప్తంగా కోటి 34 లక్షల 66 వేల ఎకరాల్లో ప్రధాన పంటలు సాగు అయ్యేలా చూడాలని వ్యవసాయ శాఖ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ మేరకు వానాకాలం పంటల సాగుకు సంబంధించి కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసింది.
సాగుకు అవసరమైన విత్తనాలు, ఎరువులను సమకూర్చేందుకు ఏర్పాట్లు ప్రారంభించింది. పత్తి విత్తనాలను అవసరానికి రెట్టింపు స్థాయిలో సిద్ధం చేయగా, ఎరువుల సరఫరాపైనా చర్యలు తీసుకుంటోంది.
కోటి 34 లక్షల 66 వేల ఎకరాల్లో 52 లక్షల ఎకరాల్లో పత్తిసాగు చేయాలని టార్గెట్‌గా పెట్టారు. 66 లక్షల ఎకరాల్లో వరిసాగు జరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ప్రధాన పంటల్లో కంది, సోయాబీన్, మొక్కజొన్న కూడా ఉన్నాయి. కంది పంటకు ప్రాధాన్యం ఇవ్వాలని వ్యవసాయ శాఖ యోచిస్తోంది. 7 లక్షలకుపైగా ఎకరాల్లో కంది సాగు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. సోయాబీన్‌ను 4.96 లక్షల ఎకరాల్లో సాగు చేయాలని నిర్ణయించారు. అలాగే పెసర్లు, మినుములు కూడా సాగు చేయాలని ప్రణాళిక రూపొందించారు.
2.12 కోట్ల కాటన్ సీడ్ ప్యాకెట్లు సిద్ధం
వానాకాలం సీజన్‌లో పత్తిసాగు కోసం వ్యవసాయ శాఖ 2.12 కోట్ల కాటన్ సీడ్ ప్యాకెట్లను సిద్ధం చేసింది. రాష్ట్రంలో 52 లక్షల ఎకరాల్లో పత్తి సాగుకు ఎకరానికి రెండు ప్యాకెట్ల చొప్పున 1.4 కోట్ల ప్యాకెట్లు మాత్రమే అవసరమని అంచనా వేసింది. అయితే దానికి రెట్టింపు స్థాయిలో విత్తనాలను సిద్ధం చేసింది. అయితే ఈనెల 18 నుంచి 22 వరకు ఆయా జిల్లాల్లోని వర్సిటీ కేంద్రాల్లో అడ్వాన్స్ బుకింగ్ ద్వారా విత్తనాలను బుక్ చేసుకోవాలని రైతులకు సూచించారు.
ఆయిల్ సీడ్స్, చిరుధాన్యాల సాగు తక్కువే
వానాకాలం సీజన్‌లో ఆయిల్ సీడ్ పంటల్లో పల్లీ పంట 50 వేల ఎకరాల లోపే సాగవుతుందని వ్యవసాయ శాఖ అంచనా వేస్తోంది. నువ్వులు వెయ్యి ఎకరాలలోపు, పొద్దుతిరుగుడు వంద ఎకరాలలోపు, కుసుమలు సుమారు 5 వేల ఎకరాల్లో సాగు కావచ్చని భావిస్తోంది. అలాగే చిరుధాన్యాల పంటలు కూడా తక్కువ స్థాయిలోనే సాగయ్యే అవకాశం ఉందని పేర్కొంది. జొన్నలు 50 వేల ఎకరాల్లో, సజ్జలు 2 వేల ఎకరాలలోపే సాగయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తోంది.
10 లక్షల టన్నుల యూరియా కేటాయింపులు
వానాకాలం పంటల సాగు కోసం 12 లక్షల టన్నులకు పైగా యూరియా అవసరం ఉంటుందని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. కాగా.. ఈ సీజన్‌కు కేంద్ర ప్రభుత్వం 10 లక్షల టన్నుల యూరియాను కేటాయించింది. ఏప్రిల్, మే, జూన్ నెలలకు నెలకు 2 లక్షల టన్నుల చొప్పున 6 లక్షల టన్నులు సరఫరా చేయాలని నిర్ణయించారు. జులైలో 1.50 లక్షల టన్నులు, ఆగస్టులో 1.50 లక్షల టన్నులు, సెప్టెంబర్‌లో లక్ష టన్నుల యూరియాను కేంద్రం కేటాయించింది.
