టిమ్స్‌‌‌‌లో హైబ్రిడ్ వైద్య సేవలు.. 70 శాతం బెడ్లు ఫ్రీ, 30 శాతం పెయిడ్!

టిమ్స్‌‌‌‌లో హైబ్రిడ్ వైద్య సేవలు.. 70 శాతం బెడ్లు ఫ్రీ, 30 శాతం పెయిడ్!
  • సనత్‌‌‌‌నగర్ టిమ్స్‌‌‌‌లో నిమ్స్ తరహా సూపర్ స్పెషాలిటీ సేవలు
  • ఆరోగ్యశ్రీ, ఇతర ప్రభుత్వ స్కీమ్‌‌‌‌ల వర్తింపుతో ఉచిత వైద్యం
  • అల్వాల్, కొత్తపేటలో 70 శాతం బెడ్లతో ఫ్రీ సర్వీస్

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న తెలంగాణ ఇన్‌‌‌‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (టిమ్స్) హాస్పిటల్స్‌‌‌‌లో సరికొత్త వైద్య విధానాన్ని తీసుకురాబోతున్నది. ఈ హాస్పిటల్స్ ప్రభుత్వ దవాఖానాలే అయినప్పటికీ, ఇక్కడ ఉచిత సేవలతో పాటు పెయిడ్ సర్వీసులను కూడా తీసుకొస్తూ కొత్తగా హైబ్రిడ్ మోడల్‌‌‌‌ను ప్రవేశపెట్టాలని ప్రభుత్వం భావిస్తున్నది. ప్రధానంగా సనత్‌‌‌‌నగర్, కొత్తపేట (ఎల్బీ నగర్), అల్వాల్ టిమ్స్ హాస్పిటల్స్‌‌‌‌లో ఉచితంగా వైద్యం అందిస్తూనే, స్థోమత కలిగిన వారికి ప్రైవేట్ హాస్పిటల్స్ మాదిరిగా స్పెషల్ ట్రీట్మెంట్ అందించనున్నారు. 

70 శాతం ఉచితం.. 30 శాతం పెయిడ్.. 

మూడు టిమ్స్‌‌‌‌ హాస్పిటల్స్‌‌‌‌ను వెయ్యి బెడ్ల సామర్థ్యంతో నిర్మిస్తున్నారు. ఈ హాస్పిటల్స్‌‌‌‌లో సుమారు 700 బెడ్లను (70 శాతం) పేదలకు ఉచిత వైద్యం కోసం కేటాయించాలని ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయించినట్లు తెలుస్తున్నది. మిగిలిన 30 శాతం అంటే 300 బెడ్లను పెయిడ్ సర్వీసుల కింద నిర్వహించాలని భావిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. విదేశీ పేషెంట్లకు కూడా టిమ్స్ హాస్పిటల్స్‌‌‌‌లో ప్రత్యేకంగా 50 బెడ్లను కేటాయించనున్నారు. అల్వాల్ టిమ్స్ కుత్బుల్లాపూర్ మెడికల్ కాలేజీ పరిధిలో, కొత్తపేట టిమ్స్ మహేశ్వరం మెడికల్ కాలేజీల పరిధిలో టీచింగ్ హస్పిటల్స్‌‌‌‌గా 70 శాతం బెడ్లతో ఫ్రీగా సేవలు అందిస్తాయి.

అటనామస్‌‌‌‌గా సనత్‌‌‌‌నగర్ టిమ్స్.. 

సనత్‌‌‌‌నగర్ టిమ్స్ మాత్రం పూర్తి అటనామస్ సంస్థగా, నిమ్స్ హాస్పిటల్ తరహాలో పనిచేయనుంది. సనత్‌‌‌‌నగర్ టిమ్స్‌‌‌‌లో ఆరోగ్యశ్రీ, సీఎంఆర్ఎఫ్, ఎల్వోసీ, ఈహెచ్‌‌‌‌ఎస్, జేహెచ్‌‌‌‌ఎస్ వంటి పథకాల ద్వారా 70 శాతం బెడ్లలో ఉచితంగా సేవలు అందించనున్నారు. ఇక్కడి డాక్టర్లకు బదిలీలు, డిప్యూటేషన్లు ఉండవు. ప్రస్తుతం సుమారు 500 మంది వైద్య సిబ్బందిని డిప్యూటేషన్‌‌‌‌పై తీసుకొని సనత్‌‌‌‌నగర్ టిమ్స్‌‌‌‌లో ట్రయల్ రన్ విజయవంతంగా నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీలలో ఉన్న సుమారు 1,400 వెకెంట్ పోస్టులను రీ డిప్లాయ్‌‌‌‌మెంట్ ద్వారా సనత్‌‌‌‌నగర్ టిమ్స్‌‌‌‌లో భర్తీ చేసుకోవడానికి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఇటీవలే క్లియరెన్స్ ఇచ్చింది. వచ్చే నెల జూన్‌‌‌‌లో పూర్తిస్థాయి సేవలను అందుబాటులోకి తెచ్చి ప్రారంభించాలని ప్రభుత్వం భావిస్తున్నది.

అప్పులు కట్టడానికే పెయిడ్ సర్వీస్.. 

గత ప్రభుత్వం ఈ హాస్పిటల్స్ నిర్మాణం కోసం బ్యాంకుల నుంచి భారీగా రుణాలు తీసుకోవడం వల్లే పెయిడ్ సర్వీసులు ప్రవేశపెట్టాల్సి వస్తోందని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు చెబుతున్నారు. గత బీఆర్‌‌‌‌ఎస్ ప్రభుత్వం బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర నుంచి రూ. 1,173 కోట్లు, ఎస్బీఐ కన్సార్టియం నుంచి రూ. 4,800 కోట్ల మేర రుణం తీసుకుంది. ఇందుకోసం నిమ్స్‌‌‌‌తో పాటు టిమ్స్ భూములను తాకట్టు పెట్టి, పేషెంట్ల నుంచి వచ్చే ఆదాయం ద్వారానే అప్పులు తీరుస్తామని ఒప్పందం చేసుకుంది.