- జూన్ 2న ‘ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం’ ప్రారంభం!
- డిప్యూటీ సీఎం అధ్యక్షతన కేబినెట్ సబ్ కమిటీ భేటీ
- విధివిధానాల ఖరారే లక్ష్యంగా మంత్రుల బృందం సమావేశం
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని ప్రతి పేద కుటుంబానికి ఆర్థిక భరోసా కల్పించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం మరో భారీ సంక్షేమ పథకానికి శ్రీకారం చుట్టనుంది. రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల జీవిత బీమా ప్రయోజనం చేకూర్చేలా ‘ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం (ఐకేజేబీపీ)’ పేరుతో సార్వత్రిక బీమా పథకాన్ని తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం జూన్ 2 నుంచి పట్టాలెక్కించేందుకు సిద్ధమవుతున్నది.
ఈ ప్రతిష్టాత్మక పథకానికి సంబంధించి విధివిధానాలను తుదిరూపు ఇచ్చేందుకు ప్రభుత్వం ఉన్నత స్థాయి కేబినెట్ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసింది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అధ్యక్షతన ఈ కమిటీ మంగళవారం సాయంత్రం 5.00 గంటలకు సమావేశం కానుంది. ఈ సమావేశంలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సభ్యులుగా పాల్గొని, బీమా అమలుకు అవసరమైన భాగస్వామ్య సంస్థల ఎంపిక, ప్రీమియం చెల్లింపులు, లబ్ధిదారుల గుర్తింపు వంటి అంశాలపై సుదీర్ఘంగా చర్చించనున్నారు.
గతంలో ఉన్న బీమా పథకాలు కేవలం రైతులకు రైతుబీమా లేదా నేతన్నలకు నేతన్నబీమా వంటివి పరిమితం కాగా, ఈ నూతన పథకం యూనివర్సల్‌గా అమలు కానుంది. అంటే ఆయా వర్గాలకు అతీతంగా అర్హులైన ప్రతి కుటుంబానికి ఇది వర్తిస్తుంది. ఈ పథకానికి అయ్యే ప్రీమియం మొత్తాన్ని ప్రభుత్వమే భరించాలని భావిస్తున్నది. తద్వారా పేద కుటుంబాలపై పైసా భారం పడకుండా రూ.5 లక్షల రక్షణ లభిస్తుంది.
కుటుంబ పెద్ద లేదా సంపాదించే వ్యక్తి అకస్మాత్తుగా మరణిస్తే, ఆ కుటుంబం రోడ్డున పడకుండా తక్షణ ఆర్థిక సాయం అందించడమే ఈ ‘ఇందిరమ్మ బీమా’ ప్రధాన ఉద్దేశంగా ఉన్నది. ఈ సమావేశంలో లబ్ధిదారులకు కార్డుల పంపిణీ, దరఖాస్తు ప్రక్రియ లేదా రేషన్ కార్డు ఆధారంగా గుర్తింపు వంటి వివరాలపై ప్రభుత్వం అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉంది.
