- మంత్రి జూపల్లి కృష్ణారావు వెల్లడి
- ఉత్సవాల బ్రోచర్‌ను ఆవిష్కరించిన మంత్రి
- 23న హైదరాబాద్‌లో రాష్ట్ర స్థాయి పర్యాటక సదస్సు
హైదరాబాద్, వెలుగు: ‘ప్రజాపాలన –- ప్రగతి ప్రణాళిక’లో భాగంగా ఈనెల18 నుంచి 23 వరకు రాష్ట్రవ్యాప్తంగా పర్యాటక వారోత్సవాలను నిర్వహించనున్నట్లు మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. శుక్రవారం సచివాలయంలోని తన చాంబర్‌లో ఈ ఉత్సవాలకు సంబంధించిన ప్రత్యేక బ్రోచర్‌ను పర్యాటక, భాషా సాంస్కృతిక, పురావస్తుశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వాణీప్రసాద్, పర్యాటకశాఖ డైరెక్టర్ లక్ష్మణ్ రంజిత్ నాయక్ తో కలిసి మంత్రి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంతర్జాతీయ మ్యూజియం దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈనెల 18న హైదరాబాద్‌లోని స్టేట్ మ్యూజియంలో ఈ వేడుకలు ప్రారంభించనున్నట్లు తెలిపారు. తెలంగాణలోని చారిత్రక వారసత్వ సంపద, ఎకో-టూరిజం ప్రదేశాలను ప్రపంచానికి చాటిచెప్పడమే ఈ వారోత్సవాల ప్రధాన ఉద్దేశమన్నారు.
రామప్ప దేవాలయం, నాగార్జునసాగర్, బుద్ధవనం, ఆలంపూర్ జోగులాంబ ఆలయం వంటి అద్భుత కట్టడాలు పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తున్నాయని కొనియాడారు. పర్యాటక రంగం ద్వారా స్థానిక యువతకు లభించే ఉపాధి అవకాశాలపై అవగాహన కల్పిస్తామన్నారు. భాషా సాంస్కృతికశాఖ, పురావస్తు (హెరిటేజ్) శాఖ, నిథమ్ సంస్థల సమన్వయంతో పర్యాటకశాఖ ఈ ఉత్సవాలను నిర్వహించనుందని వివరించారు. ఇందులో భాగంగా హెరిటేజ్ వాక్‌లు, పర్యాటక అవగాహన సదస్సులు, ప్రముఖ పర్యాటక ప్రాంతాల్లో స్వచ్ఛతా కార్యక్రమాలు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు, యూట్యూబర్లతో సమావేశాలు, జిల్లా స్థాయిల్లో ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తామని వెల్లడించారు.
