ట్రైబల్ వెల్ఫేర్ లో ఏఐని అమలు చేస్తాం : మంత్రి అడ్లూరి లక్ష్మణ్

 ట్రైబల్ వెల్ఫేర్ లో ఏఐని అమలు చేస్తాం :  మంత్రి అడ్లూరి లక్ష్మణ్
  •     మంత్రి అడ్లూరి లక్ష్మణ్

హైదరాబాద్, వెలుగు: ట్రైబల్ వెల్ఫేర్ లో ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్)ని అమలు చేస్తామని ఆ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ప్రకటించారు. అడవుల నుంచి ఏఐ దాకా గిరిజన సమాజాన్ని అభివృద్ధి శిఖరాలకు తీసుకెళ్లడం ప్రజా ప్రభుత్వ బాధ్యతని స్పష్టం చేశారు. శుక్రవారం సచివాలయంలో ‘ఏఐ ఇంటర్ వెన్షన్ డెవలప్ మెంట్ ఇన్ ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్ మెంట్’ అనే అంశంపై అధికారులతో మంత్రి రివ్యూ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గిరిజన విద్యార్థులకు ప్రపంచ స్థాయి అవకాశాలు కల్పించేందుకు ఏఐ ఆధారిత విద్యావ్యవస్థను ప్రవేశపెడుతామని వెల్లడించారు. గ్రామీణ ప్రాంతాల్లో వర్చువల్ టీచర్లు, డిజిటల్ ట్యూటర్లను అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పారు. 

పోటీ పరీక్షలకు ఏఐ ఆధారిత మాక్ టెస్టులు, కెరీర్ గైడెన్స్ అందించనున్నట్లు తెలిపారు. ప్రతి గిరిజన విద్యార్థికి డిజిటల్ స్కిల్స్ తోపాటు ఏఐ నైపుణ్యాలు నేర్పించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. విద్యార్థుల బలహీనతలను ఏఐ ద్వారా గుర్తించి ప్రత్యేక శిక్షణ అందించడంతోపాటు గిరిజన భాషల్లో ఈ–-లెర్నింగ్ కంటెంట్ అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు. ఏకలవ్య, ఆశ్రమ పాఠశాలల్లో స్మార్ట్ క్లాస్ రూమ్స్ ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. దూరప్రాంత గిరిజన గ్రామాలకు ఏఐ ఆధారిత టెలీ మెడిసిన్ సేవలు అందిస్తామని వెల్లడించారు. సమావేశంలో ట్రైబల్ డైరెక్టర్ సంతోష్, ఐటీడీఏ పీవో లు   రాహుల్, మంద మకరంద, లెనిన్ వట్సాల్, ట్రైబల్ అడిషనల్ డైరెక్టర్ సర్వేశ్వర్ రెడ్డి, టీసీఆర్ ఐ డైరెక్టర్ సముజ్వల పాల్గొన్నారు.