- సభ్యులకు శుభాకాంక్షలు తెలిపిన డిప్యూటీ సీఎం, మంత్రి
హైదరాబాద్, వెలుగు: తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ నూతన చైర్ పర్సన్ గద్వాల విజయలక్ష్మి, కమిషన్ సభ్యులు కాసోజు శంకరమ్మ, చిట్యాల శ్వేత, శశికళాయాదవ్ రెడ్డి, సదాలక్ష్మి, రాధాభాయి, ఉజ్మా షకీరా ఆదివారం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి సీతక్కను మర్యాదపూర్వకంగా కలిశారు. మహిళా కమిషన్ నూతన కార్యవర్గం ఏర్పడిన తర్వాత తొలిసారి సభ్యులు ప్రభుత్వ పెద్దలను కలిసి పుష్పగుచ్ఛాలు అందజేశారు.
ఈ సందర్భంగా నూతన కమిషన్ సభ్యులకు డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి సీతక్క శుభాకాంక్షలు తెలిపారు. మహిళా సాధికారత దిశగా కమిషన్ తన వంతు పాత్ర పోషించాలని ఆకాంక్షించారు. మహిళల రక్షణ, సంక్షేమం కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు కమిషన్ తోడ్పాటునందించాలని సూచించారు. మహిళలకు, ప్రభుత్వానికి మంచి పేరు వచ్చేలా సభ్యులందరూ కలిసికట్టుగా పనిచేయాలని చెప్పారు. మహిళల సమస్యలపై మహిళా కమిషన్ ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉంటుందని కమిషన్ చైర్ పర్సన్ తెలిపారు. అనంతరం మంత్రి పొన్నం ప్రభాకర్ తో విజయలక్ష్మి భేటీ అయ్యారు.
