- అత్యధికంగా జగిత్యాల జిల్లాలో 45.9 డిగ్రీలు
- నల్గొండ, నిర్మల్, సిద్దిపేట జిల్లాల్లో 45.8 డిగ్రీలు నమోదు
- మరో 10 జిల్లాల్లోనూ 44 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు రికార్డ్
- వచ్చే నాలుగు రోజులు 15 జిల్లాలకు రెడ్ అలర్ట్
హైదరాబాద్, వెలుగు: భానుడి భగభగతో రాష్ట్రం నిప్పుల కొలిమిలా మండుతున్నది. టెంపరేచర్లు మరోసారి రెడ్‌జోన్‌లోకి వెళ్లాయి. మంగళవారం 12 జిల్లాల్లో 45 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. వడగాడ్పులూ ఆయా జిల్లాల్లో తీవ్రంగా ఉన్నాయి. అత్యధికంగా జగిత్యాల జిల్లా ఐలాపూర్‌లో 45.9 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. నల్గొండ జిల్లా కట్టంగూర్, నిర్మల్ జిల్లా దస్తూరాబాద్, సిద్దిపేట జిల్లా శనిగరంలో 45.8 డిగ్రీల చొప్పున టెంపరేచర్లు రికార్డయ్యాయి.
మంచిర్యాల జిల్లా వెల్గనూరు, పెద్దపల్లి జిల్లా ఎలిగేడులో 45.7 డిగ్రీలు, ఆదిలాబాద్ జిల్లా రాంనగర్, కామారెడ్డి జిల్లా బోమనదేవిపల్లి, కరీంనగర్ జిల్లా గంగాధర, నిజామాబాద్ జిల్లా భీంగల్, రాజన్న సిరిసిల్ల జిల్లా పెద్దూరులో 45.6 డిగ్రీలు, కుమ్రం భీం జిల్లా సిర్పూరులో 45.5 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
మరో 10 జిల్లాల్లో 44 డిగ్రీలకుపైగా రికార్డయ్యాయి. హనుమకొండ జిల్లా పెద్ద పెండ్యాల్, ఖమ్మం జిల్లా తిమ్మారావుపేట, సూర్యాపేట జిల్లా రఘునాథపాలెంలలో 44.8 డిగ్రీలు, మహబూబాబాద్ జిల్లా తొర్రూరు, మెదక్ జిల్లా కాగజ్‌మద్దూరు, ములుగు జిల్లా గోవిందరావుపేట, యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరులో 44.5 డిగ్రీల చొప్పున టెంపరేచర్లు నమోదయ్యాయి. వరంగల్, జనగామ, జయశంకర్భూపాలపల్లి జిల్లాల్లోనూ 44 డిగ్రీలకుపైగానే రికార్డయ్యాయి.
హైదరాబాద్ సిటీలోనూ భగభగ..
హైదరాబాద్ సిటీలోనూ మంగళవారం ఎండమంట తీవ్రంగానే ఉన్నది. మూడు సర్కిళ్లు మినహా అన్ని సర్కిళ్లలోనూ 42 డిగ్రీలకుపైగానే ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అత్యధికంగా కుత్బుల్లాపూర్‌లో 42.8 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత రికార్డ్అయింది. చందానగర్‌లో 42.6, హయత్‌నగర్, సంతోష్‌నగర్, రాజేంద్రనగర్, మల్కాజిగిరిలో 42.4, బేగంపేట, గాజులరామారం, మూసాపేట, అంబర్‌పేట, ముషీరాబాద్, సరూర్‌నగర్ సర్కిళ్లలో 42.3 డిగ్రీల మేర టెంపరేచర్లు నమోదయ్యాయి.
కాగా, రాబోయే 4 రోజులపాటు రాష్ట్రంలో వడగాడ్పులు తీవ్రంగా ఉంటాయని ఐఎండీ వెల్లడించింది. ఉత్తర తెలంగాణ జిల్లాలతోపాటు ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, నల్గొండ జిల్లాలు సహా మొత్తంగా 15 జిల్లాలకు రెడ్ అలర్ట్‌ను జారీ చేసింది. మిగతా జిల్లాలనూ ఆరెంజ్ అలర్ట్‌లో పెట్టింది. ఈ నాలుగు రోజులు జాగ్రత్తగా ఉండాలని ఐఎండీ అధికారులు సూచిస్తున్నారు.
