రామ్ లల్లా విగ్రహాన్ని తయారు చేసేందుకు శిల్పుల ఎంపిక

రామ్ లల్లా విగ్రహాన్ని తయారు చేసేందుకు శిల్పుల ఎంపిక

ఆయోధ్యలో నిర్మాణంలో ఉన్న రామమందిరం కోసం రామ్ లల్లా నమూనాను సిద్దం చేయడానికి దేశంలోని ప్రసిద్ధ శిల్పులను ఎంపిక చేశారు. రామమందిరం కోసం ట్రస్ట్ మోడల్‌లలో ఒకదాన్ని ఎంపిక చేసి... దేవత చిన్ననాటి రూపాన్ని వర్ణించే విగ్రహాన్ని కూడా ప్రతిష్టించాలని నిర్ణయించారు. వచ్చే 15 రోజుల్లో తమ నమూనాలను పంపాలని ట్రస్ట్ శిల్పులను కోరింది. పద్మవిభూషణ్‌ శిల్పి సుదర్శన్‌ సాహూ, ఒడిశాకు చెందిన వాసుదేవ్‌ కామత్‌, కర్నాటకకు చెందిన కేవీ మానియా, పూణేకు చెందిన శాస్త్రయజ్ఞ దేల్కర్‌లను ట్రస్ట్ సభ్యలు ఎంపిక చేశారు. వీరంతా తొమ్మిది నుంచి 12 అంగుళాల పరిమాణంలో విగ్రహం నమూనాలను పంపనున్నారు.

రామ్ లల్లా విగ్రహాన్ని సిద్ధం చేయడానికి మహారాష్ట్ర , ఒడిశా కర్ణాటక నుండి రాళ్లను ఎంపిక చేశామని ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ తెలిపారు. దేవత నమూనాను ఖరారు చేసిన తర్వాత ట్రస్ట్ రాళ్లను ఆమోదిస్తుందని ఆయన చెప్పారు. ఇక సూర్యకిరణాలు దేవుడిపై పడేలా విగ్రహం 8.5 అడుగుల నుంచి తొమ్మిది అడుగుల ఎత్తు ఉంటుందని తెలిపారు. ప్రతి రామనవమి నాడు రామ్ లల్లా నుదుటిపై సూర్యకాంతి పడే విధంగా రామ మందిర గర్భగుడి నమూనాను రూపొందించడానికి ఆర్కిటెక్చర్, బిల్డింగ్ డిజైన్‌లో నైపుణ్యం కలిగిన దేశంలోని అగ్రశ్రేణి సంస్థలను ట్రస్ట్ నియమించిందని ఆయన వెల్లడించారు.