రిజర్వేషన్లకు ఎలాంటి ప్రమాదం లేదు: అన్నామలై

రిజర్వేషన్లకు ఎలాంటి ప్రమాదం లేదు: అన్నామలై

సంగారెడ్డి టౌన్, వెలుగు: కాంగ్రెస్  పార్టీ ఆరోపిస్తున్నట్లుగా రిజర్వేషన్లకు ఎలాంటి ప్రమాదం లేదని తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై స్పష్టం చేశారు. ఆ పార్టీ నేతలది అబద్ధపు ప్రచారం అని ఆయన విమర్శించారు. బీజేపీ నాయకత్వంలోనే ఓబీసీల రిజర్వేషన్లు అమలయ్యాయని గుర్తుచేశారు. అసెంబ్లీ ఎన్నికల ముందు ఆరు గ్యారంటీలు ప్రకటించిన కాంగ్రెస్  వాటిని అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందన్నారు. మెదక్ ​బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావును గెలిపించాలని కోరుతూ మంగళవారం పట్టణంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. 

ఈ సందర్భంగా అన్నామలై మాట్లాడారు. సుస్థిర పాలన, ఆర్థిక పురోభివృద్ధి కోసం ప్రధాని నరేంద్ర మోదీని మరోసారి బలపరచాలని కోరారు. పదేండ్ల  బీజేపీ పాలనలో ఆర్టికల్  370 తొలగింపు, ట్రిపుల్  తలాక్ రద్దు వంటి చరిత్రాత్మకమైన నిర్ణయాలు తీసుకున్నారని చెప్పారు. ఈనెల 13న రాష్ట్రంలో జరిగే ఎన్నికల్లో కమలం పువ్వు గుర్తుకు ఓటేయాలని పిలుపునిచ్చారు. రఘునందన్ రావు మాట్లాడుతూ రాముడి గురించి అనుచితంగా మాట్లాడి కించపరిచిన కాంగ్రెస్​కు తగిన గుణపాఠం చెప్పాలన్నారు. బీఆర్ఎస్  అభ్యర్థి వెంకట్రామిరెడ్డి అవినీతిలో కూరుకుపోయారని, సుస్థిర పాలన కోసం బీజేపీకి మరో అవకాశం ఇవ్వాలని కోరారు.