అమెరికా నేవీ చరిత్రలో సరికొత్త అధ్యాయానికి ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ శ్రీకారం చుట్టారు. అగ్రరాజ్య రక్షణ రంగాన్ని తిరుగులేని శక్తిగా మార్చే లక్ష్యంతో 'గోల్డెన్ ఫ్లీట్' పేరుతో ఒక భారీ యుద్ధనౌకల నిర్మాణ ప్రణాళికను అధికారికంగా ప్రకటించారు. డిసెంబర్ 22, 2025న ఫ్లోరిడాలోని మార్-ఎ-లాగో రిసార్ట్‌లో రక్షణ, విదేశీ వ్యవహారాల ఉన్నతాధికారులతో కలిసి ఈ ప్రాజెక్ట్ వివరాలను వెళ్లడించారు.
అమెరికా రక్షణ అవసరాల కోసం పాతబడిన యుద్ధ నౌకల స్థానంలో అత్యంత శక్తివంతమైన కొత్త వాటిని ప్రవేశపెట్టాలని ట్రంప్ నిర్ణయించారు. ఈ కొత్త తరహా నౌకలకు 'ట్రంప్-క్లాస్' అని పేరు పెట్టారు. ఈ శ్రేణిలో నిర్మించనున్న మొదటి యుద్ధనౌకకు 'USS డిఫైయంట్' అని పేరు కూడా ఫిక్స్ చేశారు ట్రంప్. ఇవి ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన, అతిపెద్ద, బలమైన యుద్ధనౌకలుగా ఉండనున్నాయని ట్రంప్ మాటల ప్రకారం తెలుస్తోంది. అలాగే ప్రస్తుత నేవీ షిప్స్ కంటే ఇవి 100 రెట్లు ఎక్కువ విధ్వంసక సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి.
ఒక్కో నౌక సుమారు 30వేల నుండి 40వేల టన్నుల బరువుతో ఉండనుంది. ఇవి కేవలం పరిమాణంలోనే కాకుండా.. సాంకేతికతలోనూ అగ్రగామిగా నిలుస్తాయంటున్నారు ట్రంప్. ఈ నౌకల్లో హైపర్సోనిక్ క్షిపణులు, ఎలక్ట్రోమాగ్నెటిక్ రైల్ గన్‌లు, ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన లేజర్ సిస్టమ్స్‌ను ఏర్పాటు చేయనున్నారు. అలాగే వీటిలో న్యూక్లియర్ క్షిపణులను ప్రయోగించే సామర్థ్యం కూడా ఉండేలా తీర్చిదిద్దుతున్నారు. అలాగే ఈ అత్యాధునిక వార్ షిప్స్ నిర్వహణకు ఏఐ టెక్నాలజీ కూడా తోడుగా ఉండబోతున్నట్లు చెప్పారు.
ALSO READ : ధరలు పెరగటమేనా.. తగ్గవా.. కొండలా పెరుగుతున్న వెండి ధర..
సాధారణంగా యుద్ధనౌకల డిజైన్‌లో అధ్యక్షులు జోక్యం చేసుకోరు. కానీ ట్రంప్ మాత్రం దీనిని భిన్నంగా చూస్తున్నారు. తాను ఒక 'అభిరుచి ఉన్న వ్యక్తిని' అని చెప్పుకుంటూ.. ఈ నౌకలు చూడటానికి కూడా ఎంతో ఆకర్షణీయంగా, గంభీరంగా ఉండేలా డిజైన్ చేయడంలో తాను స్వయంగా పాలుపంచుకుంటానని ఓపెన్ గా ప్రకటించారు. మెుత్తం ప్రాజెక్ట్ కింద 20 నుంచి 25 వారకు కొత్త యుద్ధ నౌకల నిర్మాణం లక్ష్యంగా పెట్టుకున్నారు ట్రంప్. అయితే స్టార్టింగ్ రెండింటి నిర్మాణానికి నిర్ణయించారు. దీనివల్ల అమెరికాలోని షిప్‌బిల్డింగ్ పరిశ్రమకు పునర్జీవం లభించడమే కాకుండా, వేలాది మందికి ఉపాధి దొరుకుతుందని ప్రభుత్వం భావిస్తోంది. చైనా వంటి దేశాల నావికా శక్తికి గట్టి సవాలు విసరడమే ఈ 'గోల్డెన్ ఫ్లీట్' ప్రధాన ఉద్దేశ్యంగా తెలుస్తోంది.
