ప్రస్తుత డిజిటల్ ప్రపంచంలో ఫ్యామిలీ సైబర్ ఇన్సూరెన్స్ అనేది అత్యవసరంగా మారిపోయింది. చాలామంది ఆన్‌లైన్ మోసాలు జరిగిన తర్వాతే దీని గురించి ఆలోచిస్తారు. ఇండియాలో సైబర్ ఇన్సూరెన్స్ ప్రాముఖ్యత, అది ఎలా పనిచేస్తుందనే వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
దేశంలో లభించే ఫ్యామిలీ సైబర్ ఇన్సూరెన్స్ పాలసీలు ప్రధానంగా ఆన్‌లైన్ బ్యాంకింగ్, యూపీఐ, క్రెడిట్/డెబిట్ కార్డ్ మోసాలు, ఫిషింగ్ స్కామ్‌ల వల్ల పోగొట్టుకున్న సొమ్మును తిరిగి పొందడానికి సహాయపడతాయి. కేవలం డబ్బు వెనక్కి ఇవ్వడమే కాకుండా.. సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయడం, బ్యాంకులతో సమన్వయం చేసుకోవడం వంటి క్లిష్ట ప్రక్రియల్లో కూడా ఇన్సూరెన్స్ కంపెనీలు మద్దతుగా నిలుస్తాయి.
ఒకవేళ మీ ఆధార్, పాన్ కార్డ్ వివరాలను ఉపయోగించి ఎవరైనా లోన్లు తీసుకోవడం లేదా తప్పుడు ఖాతాలు తెరవడం వంటివి చేస్తే.. ఆ నష్టాన్ని సరిచేయడానికి అయ్యే న్యాయపరమైన ఖర్చులు, డాక్యుమెంటేషన్ ఖర్చులను ఈ పాలసీలు కవర్ చేస్తాయి. అంతేకాకుండా.. సోషల్ మీడియాలో సైబర్ బుల్లీయింగ్, వేధింపులకు గురైనప్పుడు బాధితులకు అవసరమైన కౌన్సెలింగ్, లీగల్ సపోర్ట్ కూడా కొన్ని పాలసీలు అందిస్తున్నాయి. ఇది ముఖ్యంగా టీనేజర్లు, వృద్ధులకు ఎంతో రక్షణగా ఉంటుంది.
►ALSO READ | ఆన్‌లైన్ మోసాల బాధితులకు RBI అండ.. ఇకపై రూ.25వేల పరిహారం..!
అయితే సైబర్ ఇన్సూరెన్స్ ఉంది కదా అని నిర్లక్ష్యంగా ఉండకూడదు. మీరు స్వయంగా OTP లేదా UPI PIN పంచుకోవడం వల్ల జరిగే నష్టాలను ఇన్సూరెన్స్ కంపెనీలు కవర్ చేయవు. వీటిని నిర్లక్ష్యం కింద పరిగణించి క్లెయిమ్‌లను తిరస్కరిస్తాయి. అలాగే బిట్‌కాయిన్ వంటి క్రిప్టో కరెన్సీ స్కామ్‌లు, ఆన్‌లైన్ బెట్టింగ్ లేదా అనధికారిక పెట్టుబడి యాప్‌లలో పోగొట్టుకున్న సొమ్ముకు కూడా ఇన్సూరెన్స్ కవరేజీ వర్తించదు.
సైబర్ మోసం జరిగినప్పుడు 24 నుండి 72 గంటల లోపు బ్యాంకుకు.. పోలీసులకు సమాచారం అందించడం తప్పనిసరి. ఆలస్యంగా ఫిర్యాదు చేస్తే క్లెయిమ్ పొందే అవకాశం ఉండదు. అలాగే పాలసీలో ఉండే మొత్తం వేర్వేరు విభాగాలకు పరిమితమై ఉంటుంది. ఉదాహరణకు రూ. 10 లక్షల పాలసీలో ఆన్‌లైన్ ఫ్రాడ్‌కు రూ.2 లక్షలే పరిమితి ఉండవచ్చు. కాబట్టి పాలసీ తీసుకునే ముందే ఆ ఫైన్ ప్రింట్ చదవి దేనికి కవరేజ్ రూల్స్ ఎలా ఉన్నాయనేది అర్థం చేసుకోవటం చాలా ముఖ్యం. మెుత్తానికి సైబర్ ఇన్సూరెన్స్ అనేది మన జాగ్రత్తకు ప్రత్యామ్నాయం కాదు, కానీ మన జాగ్రత్త విఫలమైనప్పుడు ఆదుకునే ఒక 'బ్యాకప్ ప్లాన్' మాత్రమే. ఆన్‌లైన్ షాపింగ్, డిజిటల్ చెల్లింపులు ఎక్కువగా చేసే కుటుంబాలకు ఇది ఒక రక్షణ కవచంలా పనిచేస్తుంది.
