ఆన్‌లైన్ మోసాల బాధితులకు RBI అండ.. ఇకపై రూ.25వేల పరిహారం..!

ఆన్‌లైన్ మోసాల బాధితులకు RBI అండ.. ఇకపై రూ.25వేల పరిహారం..!

ఆన్‌లైన్ మోసాలకు గురవుతున్న సామాన్యులకు RBI తీపి కబురు అందించింది. ఫిబ్రవరి 6న జరిగిన మానిటరీ పాలసీ సమావేశం తర్వాత ఆర్‌బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా కకీలక నిర్ణయాన్ని ప్రకటించారు. చిన్న మొత్తంలో జరిగే ఆన్‌లైన్ మోసాలకు సంబంధించి బాధితులకు రూ.25వేల వరకు పరిహారం చెల్లించేలా కొత్త రూల్స్ తీసుకురానున్నట్లు చెప్పారు. డిజిటల్ పేమెంట్స్ భద్రతను పెంచడం, కస్టమర్ల ప్రయోజనాలను రక్షించడమే లక్ష్యంగా ఈ ఫ్రేమ్‌వర్క్‌ను రూపొందిస్తున్నారు.

ప్రస్తుతం దేశంలో జరుగుతున్న డిజిటల్ మోసాలలో దాదాపు 65 శాతం కేసులు రూ.55వేల లోపు విలువ కలిగినవేనన్నారు మల్హోత్రా. విలువ పరంగా ఇవి చిన్నవిగా అనిపించినా, సంఖ్యాపరంగా ఇవే ఎక్కువగా ఉంటున్నాయన్నారు. అందుకే ఈ చిన్నపాటి మోసాల బారిన పడే సామాన్యులకు తక్షణ ఊరటనిచ్చేలా ఈ కంపెన్సేషన్ రూల్స్ ప్రవేశపెడుతున్నారు. అనధికారిక ఎలక్ట్రానిక్ బ్యాంకింగ్ లావాదేవీల వల్ల కస్టమర్లు ఎదుర్కొనే నష్టాలకు బ్యాంకులే బాధ్యత వహించేలా కొత్త గైడ్ లైన్స్ త్వరలో విడుదల కాబోతున్నాయని మల్హోత్రా వెల్లడించారు.

ఈ పరిహారం ఎవరికి, ఎలా అందుతుంది? 

ఆర్‌బీఐ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ పరిహారం పొందేందుకు కస్టమర్లు కొన్ని నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. మోసం జరిగిన వెంటనే 48 నుండి 72 గంటల లోపు బ్యాంకుకు సమాచారం అందించి. సైబర్ క్రైమ్ పోర్టల్‌లో ఫిర్యాదు చేసిన వారికి ఈ పరిహారం వర్తించే అవకాశం ఉంది. కస్టమర్ వైపు ఎటువంటి తప్పు లేదని, అంటే ఓటీపీ లేదా పిన్ నంబర్లను వారు పంచుకోలేదని విచారణలో తేలితే.. బ్యాంకులు ఆ నష్టాన్ని భరించాల్సి ఉంటుంది. ముఖ్యంగా సీనియర్ సిటిజన్ల కోసం "ల్యాగ్డ్ క్రెడిట్స్" , అదనపు అథెంటికేషన్ పద్ధతులను కూడా ఆర్‌బీఐ పరిశీలిస్తోంది.

డిజిటల్ చెల్లింపులు వేగంగా పెరుగుతున్న తరుణంలో.. కేటుగాళ్లు కూడా అత్యాధునిక పద్ధతుల్లో మోసాలకు పాల్పడుతున్నారని ఆర్‌బీఐ గుర్తించింది. 2024–25 ఆర్థిక సంవత్సరంలో బ్యాంకులు దాదాపు 13,469 కార్డు, ఇంటర్నెట్ ఆధారిత మోసాలను రిపోర్ట్ చేశాయి. వీటి విలువ సుమారు రూ.520 కోట్లు. ఇక రిపోర్ట్ కాని మోసాలు ఇంకెన్ని ఉన్నాయో మాటల్లో చెప్పలేం. ఈ మోసాల తీవ్రతను తగ్గించేందుకు బ్యాంకు కౌంటర్లలో విక్రయించే థర్డ్ పార్టీ ప్రొడక్టులపై కూడా ఆర్‌బీఐ నిఘా పెంచింది.