With Love Review: స్కూల్ డేస్ క్రష్ ఒక మధుర జ్ఞాపకం! అనస్వర రాజన్ 'విత్ లవ్' హిట్టా? ఫట్టా?

With Love Review: స్కూల్ డేస్ క్రష్ ఒక మధుర జ్ఞాపకం! అనస్వర రాజన్ 'విత్ లవ్' హిట్టా? ఫట్టా?

గత ఏడాది 'టూరిస్ట్ ఫ్యామిలీ' వంటి సక్సెస్‌ఫుల్ చిత్రాన్ని అందించిన అభిషన్ జీవింత్ హీరోగా పరిచయమవుతూ నటించిన ఈ చిత్రం "విత్ లవ్" (With Love).  ఈ రొమాంటిక్ డ్రామా విడుదలకు ముందే టీజర్, ట్రైలర్లతో యూత్‌లో మంచి క్రేజ్ సంపాదించుకుంది. సౌందర్య రజనీకాంత్ వంటి అభిరుచి గల నిర్మాత ఈ సినిమాను నిర్మించడంతో అంచనాలు భారీగా పెరిగాయి. భారీ అంచనాలతో ఈ మూవీ ఈ రోజు ( ఫిబ్రవరి 6, 2026 ) విడుదలైంది. మరి ఈ యూత్ ఫుల్ లవ్ స్టోరీ ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో చూద్దాం..

కథా నేపథ్యం..

ఈ కథలో సత్య శీలన్ (అభిషన్ జీవింత్) ఒక అర్టిటెక్ట్ డిజైనర్. ఇంట్లో వాళ్లు ఎన్ని పెళ్లి సంబంధాలు చూసినా ఏదో ఒక కారణం చెప్పి రిజెక్ట్ చేస్తూ ఉంటాడు. అతని ప్రవర్తనతో విసిగిపోయిన సత్య సోదరి, అమ్మాయి వివరాలు చెప్పకుండానే ఒక పెళ్లి చూపులను ఒక కాఫీ షాప్ లో ఫిక్స్ చేస్తుంది. అక్క మాట కాదనలేక వెళ్లిన సత్యకు అక్కడ మోనిష (అనస్వర రాజన్) పరిచయమవుతుంది. మోనిష ఒక పాపులర్ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్.

ALSO READ : సినీ ఇండస్ట్రీలో డ్రగ్స్ ప్రకంపనలు..

మాటల సందర్భంలో.. సత్య తన స్కూల్ సీనియర్ అని మోనిష గుర్తిస్తుంది. అక్కడి నుంచి వారి సంభాషణ గతంలోకి మళ్ళుతుంది. తమ పాత ప్రేమలు, స్కూల్ క్రష్‌లు, విఫలమైన బంధాల గురించి చర్చించుకుంటారు. ఈ క్రమంలో మోనిష ఒక వినూత్నమైన ఐడియా ఇస్తుంది. "మన పాత ప్రేమికులను మళ్లీ కలిసి, ఆ బంధాలకు ఒక క్లోజర్ ఇద్దాం అని ప్రతిపాదిస్తుంది. మరి ఈ ప్రయాణం వారి జీవితాలను ఎలా మార్చింది? ఒకరినొకరు అర్థం చేసుకునే క్రమంలో వారు ప్రేమలో పడ్డారా? చివరికి సత్య ఎవరిని పెళ్లాడాడు? అనేదే ఈ సినిమా క్లైమాక్స్.

సినిమా ఎలా ఉందంటే?
 

ప్రేమకథలు అనగానే ఒకే రకమైన మూస ధోరణిలో సాగుతుంటాయి. కానీ "విత్ లవ్" చిత్రంలో స్కూల్ క్రష్‌లను మళ్లీ కలవడం అనే పాయింట్ చాలా తాజాగా అనిపిస్తుంది. దర్శకుడు మదన్ ఈ సింపుల్ ప్లాట్‌ను చాలా ఎమోషనల్‌గా, రిలేటబుల్‌గా తెరకెక్కించారు. ఫస్టాఫ్ అంతా కాలేజ్ రోజులు, స్నేహం, ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్లతో సరదాగా సాగిపోతుంది. ముఖ్యంగా స్కూల్ రోజులను గుర్తుచేసే సన్నివేశాలు ప్రతి ఒక్కరికీ తమ పాత జ్ఞాపకాలను గుర్తుకు తెస్తాయి. సెకండాఫ్ పూర్తిగా డ్రామా మీద నడుస్తుంది. కొంత నెమ్మదించినట్లు అనిపించినా, రీయూనియన్ సీన్లు , ఒకరి వ్యక్తిత్వాన్ని మరొకరు అర్థం చేసుకునే సీన్లు హృదయాన్ని హత్తుకునేలా ఉన్నాయని సినీ ప్రేక్షకులు ప్రశంసిస్తున్నారు.

ALSO READ : తిహార్ జైలులో లొంగిపోయిన ‘కిక్‌ 2’ నటుడు..

ఎవరెవరు ఎలా నటించారంటే?

నటుడిగా మారిన అభిషన్ జీవింత్ మంచి పరిణతి కనబరిచాడు. ఒక ప్రేమికుడిగా, పొసెసివ్ గుణం ఉన్న యువకుడిగా యూత్‌కు కనెక్ట్ అయ్యేలా నటించాడు. ఇక మలయాళ ముద్దుగుమ్మ అనస్వర రాజన్ ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణ. ఆమె స్క్రీన్ ప్రెజెన్స్, సెటిల్డ్ పర్ఫార్మెన్స్ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లాయి. కావ్య అనిల్ ఉన్నంతలో తన పాత్రకు న్యాయం చేసింది.  ఈ బ్యూటీ నటన, అభినయం యూత్ ను కట్టిపడేస్తోందంటున్నారు ప్రేక్షకులు..

సాంకేతిక విభాగం.. 

దర్శకుడు మదన్ తొలి సినిమా అయినా ఎక్కడా తడబడకుండా కథను నడిపించారు. షాన్ రోల్డన్ అందించిన సంగీతం, నేపథ్య సంగీతం సినిమా మూడ్‌ను చక్కగా క్యారీ చేశాయి. ముఖ్యంగా ప్రేమ సన్నివేశాల్లో బిజీఎం ప్లస్ అయ్యింది. సంతోష్ సినిమాటోగ్రఫీ లోకేషన్స్ అందాలను, ఎమోషన్స్‌ను కలర్‌ఫుల్‌గా చూపించింది. సౌందర్య రజనీకాంత్ నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి. తెలుగు డబ్బింగ్, డైలాగ్స్ సహజంగా ఉన్నాయి

ALSO READ : రామ్ చరణ్ 'ట్విన్స్'కు బాలయ్య స్పెషల్ గిఫ్ట్..

అయితే సెకండాఫ్ ప్రారంభంలో కథ కాస్త సాగదీసినట్లు అనిపిస్తుంది. తండ్రీకొడుకుల మధ్య ఉండే సంఘర్షణను ఇంకాస్త లోతుగా చూపిస్తే బాగుండేదన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. క్లైమాక్స్ ఊహించదగ్గదే కావడంతో కొంతమందికి రెగ్యులర్ లవ్ స్టోరీలా అనిపించేలా ఉంటుందని సినీ ప్రియల నుంచి అభిప్రాయం వ్యక్తం అవుతోంది 

మొత్తానికి "విత్ లవ్" ఒక స్వచ్ఛమైన, యూత్‌ఫుల్ రొమాంటిక్ డ్రామా . పాత జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ, ప్రస్తుత బంధాల విలువను చాటిచెప్పే ఈ చిత్రం ఈ వీకెండ్‌లో ఫ్యామిలీతో లేదా స్నేహితులతో కలిసి చూడదగ్గ మూవీ. ముఖ్యంగా స్కూల్ డేస్ క్రష్‌లు ఉన్నవారికి ఈ సినిమా ఒక బ్యూటిఫుల్ రైడ్‌లా అనిపిస్తుందన్న భావన సినీ ప్రియుల్లో వ్యక్తం అవుతోంది. భారీ అంచనాలతో వచ్చిన ఈ చిన్న చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో చూడాలి మరి.

ALSO READ : పాడుబడ్డ ఇంట్లో పెద్దపులి...