సినీ రంగుల ప్రపంచంలో డ్రగ్స్ వ్యవహారం మరోసారి కలకలం రేపుతోంది. చెన్నై వేదికగా సాగుతున్న మాదకద్రవ్యాల నెట్‌వర్క్‌ను యాంటీ నార్కోటిక్స్ ఇంటెలిజెన్స్ యూనిట్ (ANIU) ఛేదించింది. ఈ ఆపరేషన్‌లో భాగంగా మలయాళ, తమిళ చిత్రాల్లో నటించిన ప్రముఖ నటి అంజు కృష్ణ, తమిళ కో- డైరెక్టర్ విన్సీ నివేత సహా ఎనిమిది మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ డ్రగ్స్ దందా వ్యవహారం ఇప్పుడు సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.
సినిమా ఫక్కీలో పోలీసుల ఆపరేషన్
చెన్నై నగరంలో డ్రగ్స్ సరఫరా జరుగుతోందన్న పక్కా సమాచారంతో పోలీసులు రంగంలోకి దిగారు. తొలుత నేషపాక్కం ప్రాంతానికి చెందిన విఘ్నేశ్వరన్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అతడిని విచారించగా.. వెంకటేష్ కుమార్ అనే వ్యక్తి డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు కీలక సమాచారం వెలుగులోకి వచ్చింది. దీంతో పోలీసులు ఒక సినిమాటిక్ ప్లాన్ వేశారు. డెకాయ్ ఆపరేషన్ ద్వారా వెంకటేష్ కుమార్‌ను వలసరావాక్కం ప్రాంతానికి రప్పించారు. అతను తన కారులో డ్రగ్స్ డెలివరీ ఇవ్వడానికి రాగానే పోలీసులు చుట్టుముట్టి అరెస్ట్ చేశారు. ఆ కారులో వెంకటేష్‌తో పాటు నటి అంజు కృష్ణ, విన్సీ నివేత కూడా ఉండటం అధికారులను విస్మయానికి గురిచేసింది.
ఏమేం స్వాధీనం చేసుకున్నారంటే?
ఈ దాడుల్లో పోలీసులు భారీ మొత్తంలో సింథటిక్ డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. 6 గ్రాముల మెతాంఫేటమైన్ (మెత్), 7 గ్రాముల OG గంజాయి, 15 గ్రాముల సాధారణ గంజాయి , LSD స్టాంపులు, స్మోకింగ్ బాంగ్స్ పట్టుకున్నారు. నిందితుల నుంచి 9 మొబైల్ ఫోన్లు, ఒక కారును సీజ్ చేశారు.
►ALSO READ | చెక్ బౌన్స్ కేసు: తిహార్ జైలులో లొంగిపోయిన ‘కిక్ 2’ నటుడు..
ఎవరీ అంజు కృష్ణ?
కేరళలోని త్రిస్సూర్‌కు చెందిన అంజు కృష్ణ మోడలింగ్‌తో తన కెరీర్ ప్రారంభించింది. అనంతరం మలయాళం, తమిళ సినిమాల్లో నటిగా గుర్తింపు తెచ్చుకుంది. జోజు జార్జ్ ప్రధాన పాత్రలో నటించిన 'ఆరో' (Aaro) సినిమాతో ఆమె నటిగా మంచి పేరు తెచ్చుకుంది. మలయాళంలో 'సుమేష్ & రమేష్', 'ఆకాశం కడన్' వంటి చిత్రాల్లో నటించింది. తమిళంలో 'వెల్లిమలై' చిత్రంతో వెండితెరకు పరిచయమైంది. ఫ్లవర్స్ టీవీలో ప్రసారమైన 'ప్రియంకరి' సీరియల్ ద్వారా బుల్లితెర ప్రేక్షకులకు కూడా ఆమె సుపరిచితమే. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ.. నిత్యం గ్లామరస్ ఫోటోషూట్‌లతో అలరిస్తున్న అంజు కృష్ణ, ఇలా డ్రగ్స్ కేసులో పట్టుబడటం ఆమె అభిమానులను దిగ్భ్రాంతికి గురిచేసింది.
కటకటాల వెనక్కి నిందితులు
అరెస్ట్ అయిన వారందరినీ పోలీసులు మేజిస్ట్రేట్ ముందు హాజరుపరచారు. కోర్టు వారికి జ్యుడీషియల్ కస్టడీ విధించింది. ప్రస్తుతం వీరందరూ జైలులో ఉన్నారు. వీరికి డ్రగ్స్ మాఫియాతో ఎంతకాలంగా సంబంధాలు ఉన్నాయి? కేవలం వాడుతున్నారా లేక సరఫరాలోనూ భాగస్వాములుగా ఉన్నారా? అనే కోణంలో వలసరావాక్కం పోలీసులు లోతైన దర్యాప్తు చేస్తున్నారు. గ్లామర్ లోకంలో ఇలాంటి సంఘటనలు తరచూ వెలుగులోకి రావడం యువతపై ప్రతికూల ప్రభావం చూపుతోందని సామాజిక విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
