కోడింగ్ చేసే సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు వేరే పని వెతుక్కోవటం మంచిది: జోహో శ్రీధర్ వెంబు

 కోడింగ్ చేసే సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు వేరే పని వెతుక్కోవటం మంచిది: జోహో శ్రీధర్ వెంబు

దేశీయ SaaS టెక్ కంపెనీ జోహో వ్యవస్థాపకుడు శ్రీధర్ వెంబు లేటెస్ట్ కామెంట్స్ ఐటీ ప్రపంచంలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. జస్ట్ కోడింగ్‌పైనే ఆధారపడిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ల భవిష్యత్తు ప్రమాదంలో పడిందంటూ ఆయన హెచ్చరిక ఇప్పుడు టెక్కీల గుండెల్లో గుబులు పుట్టిస్తోంది. AI అభివృద్ధి చెందుతున్న తీరు చూస్తుంటే.. త్వరలోనే ప్రోగ్రామర్లు తమ జాబ్స్ మార్చుకోవాల్సిన పరిస్థితి వస్తుందని కుండబద్దలు కొట్టారు. ఆంత్రోపిక్ సీఈవో కూడా రానున్న ఏడాది కాలంలో సాఫ్ట్ వేర్ ఉద్యోగాలను ఏఐ ఏజెంట్లు, టూల్స్ భర్తీ చేస్తాయని ముందుగానే హెచ్చరించిన సంగతి తెలిసిందే.

శ్రీధర్ వెంబు ఈ కామెంట్స్ చేయడానికి ప్రధాన కారణం AI సాధిస్తున్న అద్భుతమైన ప్రగతి. ఒక వ్యక్తికి కనీస కోడింగ్ జ్ఞానం లేకపోయినా.. కేవలం AI సాయంతో 'భగవద్గీత' యాప్‌ను రూపొందించడం ఆయనను ఆశ్చర్యానికి గురిచేసింది. అంతేకాకుండా ఆంత్రోపిక్ సంస్థ తన క్లాడ్ AI ద్వారా ఏకంగా ఒక 'C కంపైలర్'ను నిర్మించడం సామాన్యమైన విషయం కాదని గుర్తుచేశారు. సంక్లిష్టమైన ఇంజనీరింగ్ పనులను కూడా AI చిటికెలో పూర్తి చేస్తుండటంతో.. ఇకపై కోడింగ్ రాసే మనుషుల అవసరం ఎంతవరకు ఉంటుందనేది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారిపోయింది ప్రపంచ వ్యాప్తంగా.

కోడింగ్‌పై ఆధారపడి బతుకుతున్న వారు వేరే ఉపాధి మార్గాలను వెతుక్కోవడం మంచిదని వెంబు హెచ్చరించారు. ఇందులో నాతో సహా అందరూ ఉన్నారంటూ వెంబు చెప్పడం టెక్కీలను తీవ్ర ఆందోళనలోకి నెట్టింది. ఇది భయాందోళనతో చెబుతున్న మాట కాదని.. మారుతున్న వాస్తవాన్ని అందరూ అంగీకరించడమేనని ఆయన స్పష్టం చేశారు. గూగుల్ జెమిని ప్రో లాంటి చాట్‌బాట్‌లతో తాను జరిపిన చర్చలను ఉదహరిస్తూ.. భవిష్యత్తులో ఆర్థిక వ్యవస్థలు, జాబ్స్ పూర్తిగా మారిపోతాయని అన్నారు.

►ALSO READ | లోన్ రికవరీ ఏజెంట్ల వేధింపులకు చెక్.. కొత్త రూల్స్ తీసుకొస్తున్న రిజర్వు బ్యాంక్..

అయితే ఈ పరిణామం రెండు వైపులా పదునున్న కత్తిలాంటిదని వెంబు అభిప్రాయపడ్డారు. AI నియంత్రణ కొందరి చేతుల్లోనే ఉంటే అది వినాశనానికి దారితీస్తుందని.. అదే సాంకేతికత అందరికీ అందుబాటులో ఉంటే మనుషులు ప్రకృతికి, కళలకు, కుటుంబానికి ఎక్కువ సమయం కేటాయించే బ్యూటిఫుల్ ప్రపంచం వస్తుందని చెప్పారు. సోషల్ మీడియాలో కూడా దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు టెక్కీలు తాము ఏళ్ల తరబడి నేర్చుకున్న విద్యను AI క్షణాల్లో రీప్లేస్ చేస్తుంటే తట్టుకోలేకపోతున్నారు. ఎంటర్‌ప్రైజ్ అప్లికేషన్లు అంత సులభం కాదని కొందరు వాదిస్తున్నప్పటికీ.. AI వేగం చూస్తుంటే ఐటీ రంగంలో పెనుమార్పులు తప్పవని కళ్లకు కనిపిస్తోంది.