కొత్త మెడికల్ కాలేజీల ఏర్పాటు కోసం..దరఖాస్తులకు ఎన్ఎంసీ ఆహ్వానం

కొత్త మెడికల్  కాలేజీల ఏర్పాటు కోసం..దరఖాస్తులకు ఎన్ఎంసీ ఆహ్వానం
  • ఎంబీబీఎస్ సీట్లు పెంచుకునేందుకూ గ్రీన్ సిగ్నల్

హైదరాబాద్, వెలుగు: దేశవ్యాప్తంగా కొత్త మెడికల్  కాలేజీలు ఏర్పాటు చేసుకోవడానికి, ఎంబీబీఎస్  సీట్లు పెంచుకోవాడానికి నేషనల్  మెడికల్  కమిషన్ (ఎన్ఎంసీ) గ్రీన్ సిగ్నల్  ఇచ్చింది. వచ్చే అకాడమిక్  సంవత్సరానికి (2026–27) సంబంధించి అనుమతుల కోసం అప్లికేషన్లు ఆహ్వానిస్తున్నట్లు సోమవారం నోటిఫికేషన్  జారీ చేసింది. 

ఈ నెల 29 నుంచి వచ్చే ఏడాది జనవరి 28 సాయంత్రం 6 గంటల వరకు ఎన్ఎంసీ వెబ్‌‌ సైట్‌‌లోని  పోర్టల్ లో అప్లై చేసుకోవాలని సూచించింది. అప్లికేషన్  ప్రాసెస్ అంతా ఆన్‌‌ లైన్ లోనే ఉంటుందని, ఆఫ్  లైన్, హార్డ్ కాపీ అప్లికేషన్లను స్వీకరించబోమని ఎన్ఎంసీ స్పష్టం చేసింది. 

అడ్డంకులు లేకుండా రూల్స్ ఎత్తివేత... 

10 లక్షల జనాభాకు 100 ఎంబీబీఎస్  సీట్లు ఉండాలనే నిబంధనను, అలాగే ఒక కాలేజీకి గరిష్టంగా 150 సీట్లే ఉండాలనే రూల్‌‌ ను 2026–27 విద్యా సంవత్సరానికి పక్కన పెట్టామని నోటిఫికేషన్‌‌ లో ఎన్ఎంసీ పేర్కొంది. అంటే ఈసారి కొత్త కాలేజీలకు, సీట్ల పెంపుకు పెద్దగా అడ్డంకులు ఉండకపోవచ్చు. 

ఇక ఇన్‌‌ స్పెక్షన్ల విషయంలో  బయోమెట్రిక్  అటెండెన్స్ (ఏఈబీఏఎస్), హాస్పిటల్  డేటా, సీసీ కెమెరాల నిఘా ఆధారంగా ఫిజికల్, వర్చువల్  పద్ధతిలో తనిఖీలు చేసి పర్మిషన్లు ఇస్తామని తెలిపింది. ప్రైవేట్  కాలేజీలు 50 సీట్ల కోసం రూ.7.5 లక్షలు, 100 సీట్ల కోసం రూ.15 లక్షల చొప్పున (జీఎస్టీ అదనం) ఫీజు కట్టాల్సి ఉంటదని వెల్లడించింది.