2025లో మ్యూచువల్ ఫండ్ పెట్టుబడిదారులకు మార్కెట్ గట్టి పరీక్షే పెట్టింది. అంతర్జాతీయంగా ఉద్రిక్తతలు, విదేశీ పెట్టుబడుల ఔట్ ఫ్లో మధ్య ఈక్విటీ మార్కెట్లు భారీ ఓలటాలిటీని చూశాయి. అయితే 2026లోకి అడుగుపెడుతున్న వేళ మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్లు పాటించాల్సిన వ్యూహాలు, 2025 నుంచి నేర్చుకోవాల్సిన పాఠాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్లకు 2025 ఒక రియాలిటీ చెక్ లాంటిదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈక్విటీ రిటర్నులు ఆశించిన స్థాయిలో లేవు. ముఖ్యంగా మిడ్-క్యాప్, స్మాల్-క్యాప్ ఫండ్లలో ఇన్వెస్ట్ చేసిన వారు ఒత్తిడికి గురయ్యారు. లార్జ్-క్యాప్ ఫండ్స్7.92% లాభాన్ని ఇవ్వగా, మిడ్-క్యాప్ ఫండ్స్ కేవలం 2.10% కే పరిమితమయ్యాయి. ఇక స్మాల్ క్యాప్స్ నమ్ముకున్నోళ్లకు .39% నష్టం వచ్చింది. అయితే ఈక్విటీలు నీరసించినా గోల్డ్ ఫండ్స్ 71 శాతం, సిల్వర్ ఫండ్స్ 120 శాతం రాబడులతో అదరగొట్టేశాయి. అలాగే మల్టీ అసెట్ అలొకేషన్ ఫండ్స్ 15 శాతానికి పైగా రాబడిని అందించి పెట్టుబడిదారులకు కొంత ఊరటను కలిగించాయి.
రిటర్నులు ఎప్పుడూ ఒకేలా ఉండవు. స్టాక్ మార్కెట్ వృద్ధి ఎప్పుడూ ఒకే దిశలో పైపైకి సాగదు. స్వల్పకాలిక పనితీరును చూసి లాంగ్ టర్మ్ అంచనాలు వేయకూడదని నిపుణుడు దీపక్ జైన్ హెచ్చరించారు. కేవలం స్మాల్ లేదా మిడ్-క్యాప్ ఫండ్లకే పరిమితం కాకుండా.. లార్జ్-క్యాప్, డెట్, గోల్డ్ వంటి వివిధ విభాగాల్లో ఇన్వెస్ట్ చేయటం మంచిది. మార్కెట్ హెచ్చుతగ్గుల సమయంలో సొంత నిర్ణయాల కంటే ఫ్లెక్సీ-క్యాప్ లేదా ఇండెక్స్ ఫండ్ల ద్వారా ప్రొఫెషనల్ ఫండ్ మేనేజర్లకు అవకాశం ఇవ్వడం మంచిదని నిపుణులు రజనీ తాండలే సూచించారు.
ALSO READ : జనవరి కాదు.. ఫిబ్రవరి ! Samsung Galaxy S26 సిరీస్ లాంచ్ వాయిదా ?
2026లో భారత ఆర్థిక వ్యవస్థ 7% పైగా వృద్ధిని నమోదు చేస్తుందని, కార్పొరేట్ లాభాలు మెరుగుపడతాయని నిపుణులు ఆశిస్తున్నారు. ఈ క్రమంలో ఇన్వెస్టర్లు చేయాల్సిందల్లా క్రమశిక్షణతో తమ ఎస్ఐపీ పెట్టుబడులను ముందుకు తీసుకెళ్లటమే. ఆర్‌బీఐ వడ్డీ రేట్ల తగ్గింపు సంకేతాల మధ్య డెట్ ఫండ్స్ ఈ ఏడాది స్థిరమైన లాభాలను అందించే అవకాశం ఉంది. అతిగా ఆశలు పెట్టుకోకుండా ఇన్వెస్టర్లు ముందుకు సాగాలని 2026 ప్రయాణానికి నిపుణులు సూచిస్తున్నారు. ఈక్విటీ ఫండ్స్ లో 13 శాతం వరకు, హైబ్రిడ్ ఫండ్స్ విషయంలో 11 శాతం వరకు, డెట్ ఫండ్స్ 8 శాతం వరకు రాబడులు ఇవ్వొచ్చని వారు కొత్త ఏడాదికి అంచనా వేస్తున్నారు.
ఇన్వెస్టర్లు 2026లో లాభాల వేట కంటే క్రమశిక్షణతో కూడిన పెట్టుబడులు చేయటం అన్నింటి కంటే ముఖ్యం. మార్కెట్ టైమింగ్ కంటే, సరైన పోర్ట్‌ఫోలియో రీబ్యాలెన్సింగ్ మాత్రమే సంపదను కాపాడుతుందని నిపుణులు సూచిస్తున్నారు.
