Range Rover Evoque: తమిళనాడు పారిశ్రామిక రంగంలో మరో కీలక మైలురాయి నమోదైంది. ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్.. తన లగ్జరీ బ్రాండ్ 'జాగ్వార్ ల్యాండ్ రోవర్' కార్ల ప్రొడక్షన్ తమిళనాడులోని రాణిపేట్ జిల్లా పనపాక్కం ప్లాంట్‌లో అధికారికంగా స్టార్ట్ చేసింది. ఈ అత్యాధునిక తయారీ కేంద్రం నుంచి మొట్టమొదటి 'రేంజ్ రోవర్ ఎవోక్' లగ్జరీ ఎస్‌యూవీ విజయవంతంగా బయటకు వచ్చింది. ముఖ్యమంత్రి స్టాలిన్ ఈ ప్లాంట్‌ను ప్రారంభించి.. తొలి కారును స్వయంగా నడిపారు.
ఈ ప్రాజెక్టు కోసం టాటా మోటార్స్ సుమారు రూ.9వేల కోట్లు పెట్టుబడిగా పెడుతోంది. రాబోయే కొన్నేళ్లలో ఈ పెట్టుబడిని వివిధ దశల్లో విస్తరించనున్నారు. ప్రస్తుతం జాగ్వార్ ల్యాండ్ రోవర్ వాహనాల అసెంబ్లీ కార్యకలాపాలు మహారాష్ట్రలోని పూణేలో జరుగుతుండగా.. వాటిని క్రమంగా ఈ కొత్త తమిళనాడు ప్లాంట్‌కు తరలించాలని టాటా గ్రూప్ భావిస్తోంది. దీనివల్ల దక్షిణ భారతదేశంలో టాటా మోటార్స్ తన తయారీ సామర్థ్యాన్ని పెంచుకోనుంది.
సెప్టెంబర్ 2024లో నిర్మాణ పనులు ప్రారంభించుకున్న ఈ ప్లాంట్.. రాబోయే 5 నుండి 7 ఏళ్లలో ఏడాదికి 2.5 లక్షల వాహనాలను ఉత్పత్తి చేసే స్థాయికి చేరుకుంటుందని అంచనా. ఒక వాహనాన్ని తయారు చేయడానికి దాదాపు 1,300 విడిభాగాలు అవసరమవుతాయి. ప్రారంభ దశలో రూ.900 కోట్ల పెట్టుబడితో సుమారు 20వేల రేంజ్ రోవర్ వాహనాలను ఇక్కడ తయారు చేయడమే లక్ష్యంగా కంపెనీ ముందుకు సాగుతోంది. హ్యుందాయ్, రెనో, నిస్సాన్, బీఎమ్‌డబ్ల్యూ, విన్‌ఫాస్ట్ తర్వాత తమిళనాడులో కార్ల ఉత్పత్తిని చేపట్టిన ఆరో అంతర్జాతీయ సంస్థగా టాటా- జేఎల్ఆర్ నిలిచింది.
ప్రస్తుతం మార్కెట్‌లో రేంజ్ రోవర్ ఎవోక్ ప్రారంభ ధర రూ.64లక్షల 86వేలు (ఎక్స్-షోరూమ్)గా ఉంది. ఈ లగ్జరీ కారు పెట్రోల్, డీజిల్ ఇంజన్ ఆప్షన్లలో లభిస్తోంది. 2.0-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్ 250hp శక్తిని, 2.0-లీటర్ డీజిల్ ఇంజన్ 204hp శక్తిని ఉత్పత్తి చేస్తాయి. 9 -స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్, ఆల్-వీల్-డ్రైవ్ సిస్టమ్ వంటి అత్యాధునిక ఫీచర్లతో రూపొందిన ఈ కారు.. మెర్సిడెస్-బెంజ్ GLA, బీఎమ్‌డబ్ల్యూ X1 లాంటి మోడళ్లకు గట్టి పోటీ ఇవ్వనుంది. స్థానికంగానే ఉత్పత్తి ప్రారంభం కావడం వల్ల భవిష్యత్తులో ఈ లగ్జరీ కార్ల ధరలు తగ్గే అవకాశం ఉందని ఆటో వర్గాలు అంచనా వేస్తున్నాయి.
