సైబర్ క్రైమ్స్.. ఆన్ లైన్ మోసాలు.. వాళ్లు వీళ్లు అని తేడా లేదు.. అందర్నీ బలి చేస్తున్నాయి. పంజాబ్ రాష్ట్రంలోనే సీనియర్ పోలీస్ ఆఫీసర్.. ఇటీవలే రిటైర్ అయ్యారు. పోలీస్ IGగా పని చేస్తూ.. పోలీసులకే పోలీస్ బాస్ గా గుర్తింపు పొందారు అమర్ సింగ్.. అలాంటి మాజీ పోలీస్ IG.. ఆన్ లైన్ మోసానికి పాల్పడ్డాడు. తుపాకీతో తనను తాను కాల్చుకునే ముందు.. ఆన్ లైన్ ద్వారా మోసపోయిన విషయాన్ని.. 12 పేజీల్లో వివరించాడు.. ప్రస్తుతం ఆస్పత్రిలో చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న మాజీ పోలీస్ IG అమర్ సింగ్.. సైబర్ క్రైమ్ మోసగాళ్ల చేతిలో ఎలా చిక్కాడు.. ఎలా మోసపోయాడు అనేది వివరంగా తెలుసుకుందాం..
మాజీ పోలీస్ IG అమర్ సింగ్ కు.. వాట్సాప్ ద్వారా ఓ లింక్ వచ్చింది. ఇన్వెస్ట్ మెంట్ మోడల్ అని చెప్పారు. మోసగాళ్లు.. కేటుగాళ్లు.. తనను తాను DBS బ్యాంక్ సీఈవో రజత్ వర్మ అని పరిచయం చేసుకున్నారు. వాళ్ల ప్రొఫైల్ చెక్ చేస్తే.. నిజంగానే అంతా నిజమే అనుకున్నాడు. ఫొటోలు, క్వాలిఫికేషన్, ఐడెండిటీ అంతా కూడా నిజమే అన్నట్లు మాజీ IG అమర్ సింగ్ ను నమ్మించారు. IPO, OTC ట్రేడింగ్ వల్ల మంచి లాభాలు వస్తాయంటూ క్లాస్ తీసుకున్నారు. అంతా నిజమే అనుకున్నాడు అమర్ సింగ్. ఆ తర్వాత అమర్ సింగ్ ద్వారానే.. ఆన్ లైన్ లో ట్రేడింగ్ అకౌంట్స్ ఓపెన్ చేయించారు. మొదట కోటి రూపాయలు డిపాజిట్ చేయించారు.. ఆ తర్వాత రెగ్యులర్ గా సూచనలు, సలహాలు ఇస్తూ పెట్టుబడి పెట్టించారు. రోజువారీ లాభాలతోపాటు 2 నెలల్లోనే 40 శాతం లాభాలు చూపించారు కేటుగాళ్లు.
మంచి లాభాలు వస్తున్నాయి.. DBS బ్యాంక్ చైర్మన్ నేరుగా మాట్లాడుతున్నాడు అని నమ్మిన మాజీ పోలీస్ IG అమర్ సింగ్.. బ్యాంక్ నుంచి 7 కోట్ల రూపాయల అప్పు తీసుకుని మరీ.. వాళ్లు చెప్పిన మూడు బ్యాంకుల్లోని ఖాతాల్లో డబ్బులు వేశాడు. 40 శాతం వరకు లాభాలు చూపిస్తుండటంతో.. విత్ డ్రా కోసం ప్రయత్నించాడు మాజీ పోలీస్ IG అమర్ సింగ్.. అక్కడే కథ అడ్డం తిరిగింది. విత్ డ్రా కావటం లేదు. అప్పటికే మొత్తంగా 8 కోట్ల రూపాయల వరకు పెట్టుబడి పెట్టిన అమర్ సింగ్.. విత్ డ్రా కోసం ఎన్ని సార్లు కాంటాక్ట్ అయినా పైసా రావటం లేదు.. దీనికితోడు డబ్బు విత్ డ్రా చేయాలంలే మరో 1.5 శాతం సర్వీస్ ఫీజు.. 3 శాతం పన్ను చెల్లించాలంటూ కొర్రీలు వేశారు సైబర్ నేరగాళ్లు.
కొన్ని నెలలుగా ఇలా జరుగుతున్న అమర్ సింగ్ మాత్రం ఇంట్లో వాళ్లకు చెప్పలేదు.. పోలీసులకు సమాచారం ఇవ్వలేదు. 8 కోట్ల రూపాయల అప్పులతోపాటు.. సైబర్ నేరగాళ్ల చేతిలో 8 కోట్ల రూపాయలు నష్టపోయానన్న బాధతో.. తన తుపాకీతో కాల్చుకున్నాడు. విషయం తెలిసి కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించగా.. ICUలో చికిత్స పొందుతున్నాడు. ఆరోగ్యం విషమంగా ఉన్నట్లు చెప్పారు డాక్టర్లు. కాల్పుల తర్వాత ఇంట్లోని తన గదిని పరిశీలించగా.. 12 పేజీల సూసైడ్ నోట్ దొరికింది. అందులో సైబర్ నేరగాళ్ల చేతిలో ఎలా మోసపోయింది.. ఎంత అప్పు చేసింది అనే వివరాలు వెలుగులోకి వచ్చాయి.
ఓ మాజీ పోలీస్ IG.. ఇంత పెద్ద స్థాయిలో ఉన్న వ్యక్తినే.. సైబర్ నేరగాళ్లు ఇంత ఈజీగా మోసం చేశారంటే.. ఇక మామూలు వ్యక్తుల పరిస్థితి ఏంటీ. ఇంకెంత మందిని.. ఎన్ని విధాలుగా మోసం చేస్తున్నారో కదా..
