మద్యం మత్తులో గొడవ.. మేనమామను చంపిన అల్లుడు

 మద్యం మత్తులో గొడవ..  మేనమామను చంపిన అల్లుడు
  • నల్గొండ జిల్లా నకిరేకల్‌‌లో దారుణం

నకిరేకల్, వెలుగు : మద్యం మత్తులో, జీతం డబ్బుల విషయంలో గొడవ జరుగగా.. ఆగ్రహానికి గురైన ఓ వ్యక్తి తన మేనమామను హత్య చేశాడు. ఈ ఘటన నల్గొండ జిల్లా నకిరేకల్‌‌ పట్టణంలో ఆదివారం రాత్రి జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. నకిరేకల్‌‌కు చెందిన గట్టు శ్రీకాంత్‌‌ స్థానికంగా మిల్క్‌‌ షాప్‌‌ నిర్వహిస్తున్నాడు. అతడి మేనమామ యలగందుల వెంకన్న (50) కొడుకు రాకేశ్‌‌ ఏడు నెలలుగా శ్రీకాంత్‌‌ వద్ద పాలవ్యాన్‌‌ డ్రైవర్‌‌గా పనిచేస్తున్నాడు. ఇదిలా ఉండగా.. రాకేశ్‌‌, శ్రీకాంత్‌‌ కలిసి ఆదివారం రాత్రి మద్యం సేవిస్తున్నారు. 

కొద్దిసేపటి తర్వాత వెంకన్న సైతం వారితో కలిశాడు. ఈ క్రమంలో జీతం డబ్బుల విషయంలో గొడవ ప్రారంభమైంది. దీంతో మద్యం మత్తులో ఉన్న శ్రీకాంత్‌‌ పాల ట్రేతో వెంకన్న తలపై కొట్టాడు. గమనించిన రాకేశ్‌‌ అడ్డుకునే ప్రయత్నం చేయగా అతడిపైనా దాడి చేశాడు. 

తర్వాత సిమెంట్‌‌ ఇటుకతో వెంకన్న తలపై కొట్టడంతో అతడు అక్కడికక్కడే చనిపోయాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని గాయపడిన రాకేశ్‌‌ను మొదట నకిరేకల్‌‌ ప్రభుత్వ హాస్పిటల్‌‌కు, అక్కడి నుంచి నల్గొండ ప్రభుత్వ హాస్పిటల్‌‌కు రెఫర్‌‌ చేశారు. శాలిగౌరారం సీఐ కొండల్‌‌రెడ్డి ఘటనాస్థలాన్ని సందర్శించి వివరాలు సేకరించారు. పరారీలో ఉన్న శ్రీకాంత్‌‌ కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.