న్యూఢిల్లీ, వెలుగు: ఏపీ డిప్యూటీ సీఎం, సినీ నటుడు పవన్ కల్యాణ్, ప్రముఖ సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్ దాఖలు చేసిన పిటిషన్లపై నటుల వ్యక్తిత్వ హక్కులకు భంగం కలిగించేలా సోషల్ మీడియాలో ఉన్న ఐపీ లాగిన్ల వివరాలు మూడు వారాల్లో అందించాలని సంబంధిత సంస్థలను ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది.
తమ అనుమతి లేకుండా సామాజిక మాధ్యమాల్లో తమ ఫొటోలు, వీడియోలను వాణిజ్య అవసరాలకు వినియోగించడం, తప్పుడు ప్రచారం చేయడం వల్ల తమ వ్యక్తిగత హక్కులకు భంగం వాటిల్లుతోందని పవన్ కల్యాణ్, జూనియర్ ఎన్టీఆర్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఫ్లిప్‌కార్ట్, అమెజాన్, గూగుల్, ఎక్స్ (ట్విట్టర్), ఇన్‌స్టాగ్రామ్‌ను ప్రతివాదులుగా చేర్చారు.
ఆ పిటిషన్లు సోమవారం జస్టిస్ మన్మీత్ ప్రీతం సింగ్ అరోరా నేతృత్వంలోని ఏకసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. అయితే, గత హైకోర్టు ఆదేశాల మేరకు కొన్ని లింకులను తొలగించినట్టు ప్రతివాదుల తరఫు న్యాయవాదులు బెంచ్ కునివేదించారు. అయితే, కొన్ని లింకులను మాత్రమే తొలగించారని, మరికొన్ని అలాగే ఉన్నాయని తెలిపారు. అవి ఎందుకు తొలగించలేదు అనేది తెలుపుతూ, సంబంధిత ఐపీ లాగిన్ల వివరాలను మూడువారాల్లో అందించాలని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను మే 12వ తేదీకి వాయిదా వేసింది.
