ఢిల్లీలోని భారత్ మండపంలో ప్రపంచ స్థాయి టెక్ దిగ్గజాలతో జరిగిన ఇండియా AI ఇంపాక్ట్ సమ్మిట్ లో ఊహించని ఘటన జరిగింది. లోపల మేధావులు కృత్రిమ మేధ (AI) గురించి చర్చిస్తుంటే, బయట మాత్రం ప్రతినిధులు రవాణా సౌకర్యాలు లేక నానా అవస్థలు పడ్డారు.
VVIPల పేరుతో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించడంతో కార్యక్రమం ముగిశాక బయటకు వచ్చిన వారికి కనీసం క్యాబ్ కూడా దొరకలేదు. భారత్ మండపం చుట్టుపక్కల రోడ్లను పోలీసులు బ్లాక్ చేశారు. ఓలా, ఉబర్ వంటి క్యాబ్ సర్వీసులను లోపలికి అనుమతించకుండా నిలిపివేశారు. దగ్గరలో ఉన్న సుప్రీంకోర్టు మెట్రో స్టేషన్ గేట్లను కూడా మూసివేశారు.
చాలా మంది ప్రతినిధులు ఈ చేదు అనుభవాలను సోషల్ మీడియాలో షేర్ చేసారు. ఓ కెనడా జాతీయుడు మాట్లాడుతూ.. రాత్రి 7:40కి బయటకు వస్తే ఒక్క షటిల్ బస్సు కూడా లేదు. అందరినీ నడిచి వెళ్ళమన్నారు. ఇక విదేశీయులు, వికలాంగుల పరిస్థితి ఏంటి అని కూడా ఆలోచించరా అని ప్రశ్నించారు.
సాహిల్ రాజ్‌పుత్ అనే ఓ ప్రతినిధి మాట్లాడుతూ.. క్యాబ్ దొరకడానికి ఏకంగా 5 కిలోమీటర్లు నడవాల్సి వచ్చిందని వాపోయారు. మెట్రో స్టేషన్ మూసివేయడంతో మరో స్టేషన్ చేరుకోవడానికి 3 కి.మీ నడిచానని, ఇదొక AI గందరగోళ సమ్మిట్ అని ఇంకొకతను విమర్శించారు.
ఈ నిర్వహణ లోపంపై ఆప్ నాయకుడు సౌరభ్ భరద్వాజ్ మండిపడ్డారు. అంతర్జాతీయ ప్రతినిధుల ముందు మన దేశ పరువు తీస్తున్నారు. కృత్రిమ మేధస్సు (AI) కంటే ముందు, ట్రాఫిక్‌ను నిర్వహించడానికి అధికారులకు కనీస జ్ఞానం ఉండాలి అని ఎద్దేవా చేశారు.
ముఖ్యంగా మధుర రోడ్, సర్దార్ పటేల్ మార్గ్ వంటి ప్రధాన రహదారులను VVIPల కోసం 40 నిమిషాల పాటు ఆపేయడంతో సామాన్య ప్రజలు కూడా ట్రాఫిక్‌లో చిక్కుకుపోయారు. మనం టెక్నాలజీలో దూసుకుపోతున్నామని చెబుతున్నా, కనీస రవాణా ఏర్పాట్లు చేయకపోవడం వల్ల అంతర్జాతీయ స్థాయిలో భారత్ ప్రతిష్టకు భంగం కలిగిందని ప్రతినిధులు భావిస్తున్నారు.
