ఉపాధి చట్టంపై బుల్డోజర్ నడిపిస్తున్నది... మోదీ సర్కార్ వ్యతిరేక విధానాలపై ఐక్యంగా పోరాడాలి

ఉపాధి చట్టంపై బుల్డోజర్ నడిపిస్తున్నది... మోదీ సర్కార్ వ్యతిరేక విధానాలపై ఐక్యంగా పోరాడాలి
  • ఎన్డీయే సర్కార్​పై సోనియా గాంధీ మండిపాటు
  • పరిణామాలు భయంకరంగా ఉంటాయని హెచ్చరిక
  • గ్రామీణ భారతాన్ని  నాశనం చేసే కుట్ర అని ఆగ్రహం

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని (ఎంజీఎన్​ఆర్​ఈజీఏ) నిర్వీర్యం చేస్తున్నదని, దీని ఫలితాలు అత్యంత భయంకరంగా ఉంటాయని కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్​పర్సన్ సోనియా గాంధీ హెచ్చరించారు. దేశ ప్రజలందరూ కలిసి మోదీ సర్కార్ వ్యతిరేక విధానాలపై ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. ఈ మేరకు సోనియా ఓ ఆర్టికల్​లో కేంద్ర ప్రభుత్వ వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 

‘ఎన్డీయే ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు గ్రామీణ భారతదేశంలోని కోట్లాది మందికి విపత్తుగా మారుతున్నాయి. ఉపాధి హామీ చట్టంపై మోదీ సర్కార్ బుల్డోజర్  ప్రయోగిస్తున్నది. ఎలాంటి ముందస్తు చర్చలు లేకుండా, రాష్ట్ర ప్రభుత్వాలను సంప్రదించకుండా ఏకపక్షంగా ఈ చట్టాన్ని మార్చడం కరెక్ట్ కాదు. ఎంజీఎన్​ఆర్ఈజీఏ స్థానంలో ‘వికసిత్ భారత్ గ్యారెంటీ ఫర్ రోజ్‌‌‌‌‌‌‌‌గార్ అండ్ ఆజీవికా మిషన్ (గ్రామీణ్)’ (వీబీజీ రామ్ జీ 2025) అనే కొత్త చట్టాన్ని తీసుకొచ్చింది. మహాత్మా గాంధీజీ పేరును తొలగించడం దారుణం. రూరల్ ఇండియాను నాశనం చేయడమే లక్ష్యంగా ఎన్డీయే సర్కార్ పని చేస్తున్నది. 

మహాత్మా గాంధీ పేరును ఈ పథకం నుంచి తొలగించడం కేవలం ఒక సంకేతం మాత్రమే. అసలు ఉద్దేశం పథకాన్ని అణిచివేయడమే. ఇది రాజ్యాంగంలోని ఆర్టికల్ 41 నుంచి ప్రేరణ పొందిన హక్కుల ఆధారిత చట్టం. గత 11 ఏండ్లుగా నిధుల  కేటాయింపును తగ్గించడం, వేతనాల చెల్లింపులో జాప్యం చేయడం ద్వారా ఈ పథకాన్ని ఇప్పటికే నీరుగార్చారు. 

బ్యూరోక్రాటిక్ పథకంగా మార్చేసిన్రు

ఉపాధి హామీని చట్టబద్ధమైన హక్కు నుంచి కేవలం ఒక బ్యూరోక్రాటిక్ పథకంగా మార్చడంతో కోట్ల మంది గ్రామీణ పేదలు ఉపాధి కోల్పోతారని, ఇది దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతుందని సోనియా గాంధీ హెచ్చరించారు. ‘‘మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం కారణంగా గ్రామాల్లో కూలీల వేతనాలు పెరిగాయి. ఇప్పుడు ఈ కొత్త చట్టంతో భూమిలేని పేదలకు ఆ బలం తగ్గిపోతుంది. పంచాయతీల చేతుల్లో ఉండే అధికారాలను కేంద్రం తన చేతుల్లోకి తీసుకుంటున్నది. ఢిల్లీ నుంచి ఎవరు పనిచేయాలో నిర్ణయించడం క్షేత్రస్థాయి వాస్తవాలకు విరుద్ధం.

 ప్రపంచంలోనే అతిపెద్ద సోషల్ సెక్యూరిటీ ప్రోగ్రామ్‌‌‌‌‌‌‌‌ను నాశనం చేస్తున్నది. 20 ఏండ్ల కింద యూపీఏ హయాంలో మన్మోహన్ సింగ్ ప్రభుత్వం ఈ విప్లవాత్మక చట్టాన్ని తెచ్చింది. కరోనా లాంటి కష్టకాలంలో వలస కార్మికులకు, పేదలకు ఈ పథకం ఒక్కటే ఆశ్రయం కల్పించింది. 100 రోజుల పనిదానాలను 125 రోజులకు పెంచినట్లు చెప్తున్నప్పటికీ.. చట్టాన్ని నిర్వీర్యం చేసే కుట్రకు పాల్పడుతున్నది. పాత చట్టంతో పోలిస్తే.. కొత్త చట్టంలో రాష్ట్రంపై ఆర్థిక భారం పెరుగుతుంది. ఈ ఒక్క చట్టమే కాకుండా.. రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్, ఎడ్యుకేషన్, ఫారెస్ట్ రైట్స్, ల్యాండ్ యాక్విజిషన్ చట్టాలపైనా మోదీ సర్కార్ దాడి చేస్తున్నది’’ అని సోనియా గాంధీ ఆరోపించారు.