ఇండోనేసియాలో బస్సు ప్రమాదం..16 మంది మృతి.. జావా ఐలాండ్ లో ఘటన

ఇండోనేసియాలో  బస్సు ప్రమాదం..16 మంది మృతి.. జావా ఐలాండ్ లో ఘటన



జకార్తా: ఇండోనేసియాలోని జావా ఐలాండ్ లో సోమవారం అర్ధరాత్రి ఘోర ప్రమాదం జరిగింది. 34 మంది ప్యాసింజర్లతో వెళ్తున్న బస్సు.. రోడ్డుపై ఉండే కాంక్రీట్ బారియర్ ను ఢీకొని పల్టీ కొట్టింది. ఈ ప్రమాదంలో 16 మంది చనిపోయారు. మరో 18 మందికి గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన దాదాపు 40 నిమిషాల తర్వాత పోలీసులు, రెస్క్యూ టీమ్స్ ఘటనాస్థలానికి చేరుకున్నాయి. అక్కడికక్కడే మరణించిన ఆరుగురిని బస్సు నుంచి బయటకు తీశారు. తీవ్ర గాయాలపాలైన మరో 10 మంది.. ఆసుపత్రికి తరలిస్తుండగా మర్గమధ్యలో చనిపోయారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్న 18 మందిలోనూ.. ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది. బస్సు జకార్తా నుంచి యోగ్యకర్తాకు వెళ్తుండగా జావాలోని సెమరాంగ్ సిటీలో ఉన్న క్రప్యాక్ టోల్ రోడ్డుపై ఈ ప్రమాదం జరిగిందని అధికారులు వెల్లడించారు. బస్సు అధిక వేగమే ప్రమాదానికి కారణంగా అనుమానిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. డ్రైవర్ కూడా తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడని చెప్పారు.