కేంద్రంలో కాంగ్రెస్ వస్తే..రిజర్వేషన్లన్నీ ముస్లింలకే : నరేంద్ర మోదీ

కేంద్రంలో కాంగ్రెస్ వస్తే..రిజర్వేషన్లన్నీ ముస్లింలకే : నరేంద్ర మోదీ
  • ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల కోటా లాక్కునేందుకు ఆ పార్టీ కుట్ర చేస్తోంది
  • లాలూ ప్రసాద్ మాటల్లోనే ఇది తేలిపోయింది
  • కాంగ్రెస్​కు ఓటుబ్యాంకు రాజకీయాలే ముఖ్యం 
  • మధ్యప్రదేశ్ లో జరిగిన ఎన్నికల ర్యాలీలో ప్రధాని

ధార్(మధ్యప్రదేశ్): కేంద్రంలో కాంగ్రెస్ కూటమి అధికారంలోకి వస్తే ఆర్టికల్ 370ని తిరిగి తీసుకొస్తుందని, అయోధ్య రామ మందిరానికి తాళం వేస్తుందని, రిజర్వేషన్లన్నీ ముస్లింలకే కట్టబెడుతుందని.. అలా జరగకుండా అడ్డుకోవాలంటే బీజేపీ ఆధ్వర్యంలోని ఎన్డీఏ కూటమికి 400 ఎంపీ సీట్లు ఇవ్వాలంటూ ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. మధ్యప్రదేశ్​లోని ధార్​లో మంగళవారం బీజేపీ లోక్ సభ ఎన్నికల ర్యాలీలో మోదీ మాట్లాడారు. ‘‘బాబాసాహెబ్​ను కాంగ్రెస్ తీవ్రంగా ద్వేషిస్తుంది. అందుకే ఆయనను తక్కువ చేయాలని చూస్తోంది. 

రాజ్యాంగ రచనలో అంబేద్కర్ పాత్ర నామమాత్రమేనని, నెహ్రూ పాత్రే గణనీయంగా ఉందని ప్రచారం చేస్తోంది. అంబేద్కర్ కు, రాజ్యాంగానికి కాంగ్రెస్ వెన్నుపోటు పొడిచింది” అని ప్రధాని విమర్శించారు. ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ మంగళవారం చేసిన వ్యాఖ్యలనూ మోదీ ప్రస్తావించారు. కాంగ్రెస్ నేతలు తమ తలలపై ఎక్కి డ్యాన్స్ చేసేలా లాలూకు అవకాశం ఇస్తున్నారని అన్నారు. 

పశువుల దాణా తిని, అవినీతి కేసులో కోర్టులో దోషిగా తేలిన వారి నాయకుడు అనారోగ్య కారణంతో బెయిల్​పై బయటకొచ్చారు. ఇప్పుడు అన్ని రిజర్వేషన్లూ ముస్లింలకే ఇవ్వాలని ఆయన అంటున్నారు. అంటే.. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల రిజర్వేషన్లన్నీ లాక్కుని ముస్లింలకు కట్టబెట్టాలని వారు ఆలోచిస్తున్నారు” అని ప్రధాని ఆరోపించారు. ‘‘కాంగ్రెస్, దాని మిత్ర పక్షాలు ఆడుతున్న ఈ ఆటను మీరు అంగీకరిస్తారా? అలాంటి వారి డిపాజిట్లు గల్లంతు కావాలా? వద్దా?” అని ప్రశ్నించారు.

బుజ్జగింపు రాజకీయాల ఊబిలో కాంగ్రెస్ 

బుజ్జగింపు రాజకీయాల ఊబిలోకి కాంగ్రెస్ చాలా లోతుగా కూరుకుపోయిందని, ఇంతకుమించి ఆ పార్టీకి ఏమీ కనిపించడంలేదని మోదీ విమర్శించారు. ఒకవేళ కాంగ్రెస్ కు అధికారం ఇస్తే.. దేశంలో నివసించే తొలి హక్కు ముస్లింలకే ఉంటుందని కూడా చెప్తుందన్నారు. ఫేక్, సూడో సెక్యులరిజం పేరిట ఇండియా గుర్తింపును చెరిపేసే ప్రయత్నాలను తాను బతికి ఉన్నంతవరకూ అడ్డుకుంటానన్నారు.

కుట్రలు తిప్పికొట్టేందుకే 400 సీట్లు 

కాంగ్రెస్ చేసే ప్రతి కుట్రనూ తిప్పికొట్టేందుకే తాము 400 సీట్లను అడుగుతున్నామని మోదీ అన్నారు. ‘‘దేశానికి చెందిన ఖాళీ భూమి, ద్వీపాలను ఇతర దేశాలకు కాంగ్రెస్ అప్పగించకుండా చూసేందుకు, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల రిజర్వేషన్లను ఆ పార్టీ లాక్కోకుండా ఉండేందుకు, ఓటుబ్యాంకుగా మారిన వర్గాలను రాత్రికి రాత్రే ఓబీసీలుగా ప్రకటించకుండా అడ్డుకునేందుకే మాకు 400 సీట్లు కావాలి” అని ఆయన కోరారు.