ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా సర్పంచులతో.. ప్రమాణ స్వీకారం చేయించిన అధికారులు

 ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా సర్పంచులతో.. ప్రమాణ స్వీకారం చేయించిన అధికారులు
  •  కొలువుదీరిన కొత్త పాలకవర్గాలు..

నల్గొండ, వెలుగు: ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా కొత్త సర్పంచులు కొలువు దీరారు. సర్పంచులతో పాటు ఉప సర్పంచులు, వార్డ్ మెంబర్లు సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా  మూడు దశల్లో 1779  గ్రామ పంచాయతీల్లో ఎన్నికల్లో గెలుపొందిన సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డ్ మెంబర్లతో ప్రమాణ స్వీకారం పూర్తి చేయించారు.  

చివ్వెంల మండలం గుంపుల గ్రామ పంచాయితీలో గెలుపొందిన నాతల పద్మమ్మ ప్రమాణ స్వీకారం అనంతరం తన తండ్రి కొనతం వెంకటరెడ్డి ఫౌండేషన్ తరఫున గ్రామ పంచాయతీకి రూ. లక్ష అందించగా గ్రామానికి మంజూరైనా ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారులకు ఒక్కొక్కరికి రూ.10,016 అందించారు. 

ఈ నెలలో జన్మించిన ఆడపిల్లకు రూ. 5,016 అందించారు. సూర్యాపేట మండలం పిన్నయి పాలెం గ్రామ పంచాయితీలో ఉన్న ప్రభుత్వ స్కూల్ విద్యార్దులకు కొలువుదీరిన పాలక వర్గం సైకిళ్లను అందించింది. నల్గొండ జిల్లా తిరుమలగిరి సాగర్ గ్రామ పంచాయతీలో వినూత్నంగా ప్రమాణ స్వీకారం ప్రోగ్రాంలో గ్రామంలో చీపురు పట్టి ఊడ్చి శ్రమదానం చేశారు.  

నార్కట్ పల్లి : నార్కట్ పల్లి మండలంలోని నూతన సర్పంచుల ప్రమాణస్వీకారంలో ఎమ్మెల్యే వేముల వీరేశం పాల్గొన్నారు. గెలిచిన సర్పంచులు, పాలకవర్గ సభ్యులు సేవకులుగా ఉండాలన్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు బత్తుల ఉషయ్య గౌడ్, ఎల్లారెడ్డిగూడెం సర్పంచ్ యలందుల లింగస్వామి, ఉప సర్పంచ్ వడ్డే అండాలు,గోపాలయపల్లి సర్పంచ్ మచ్చ జయసుధ ముత్యాలు, చిన్న నారాయణపురం సర్పంచ్ మెరుగు అనిత కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

గ్రామాభివృద్ధికి కృషి చేయాలి 

యాదగిరిగుట్ట: రాజకీయాలు వీడి గ్రామాభివృద్ధికి కృషి చేయాలని నూతనంగా ఎన్నికైన సర్పంచులకు ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య సూచించారు.  నూతనంగా ఎన్నికైన ప్రజాప్రతినిధులను ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య సన్మానం చేశారు.

 సోమవారం యాదగిరిగుట్ట మండలం సైదాపురం, మాసాయిపేట, వంగపల్లి, గౌరాయపల్లి.. తుర్కపల్లి మండలం గందమల్ల, వాసాలమర్రి, తుర్కపల్లి.. బొమ్మలరామారం మండలం యావాపూర్, మాచన్ పల్లి, మర్యాల.. మోటకొండూర్ మండలం కాటేపల్లి, మోటకొండూర్ లో నూతనంగా ఎన్నికైన గ్రామపంచాయతీ పాలకవర్గం ప్రమాణ స్వీకార వేడుకలకు ఆయన హాజరయ్యారు. 

 నూతనంగా ఎన్నికైన సర్పంచులు, ఉప సర్పంచులకు యాదగిరిగుట్ట దేవస్థానం కండువాలు కప్పి స్వామివారి లడ్డూప్రసాదం అందజేశారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ చీర శ్రీశైలం, మాజీ సర్పంచ్ బీర్ల శంకర్, మాజీ ఉప సర్పంచ్ గుండ్లపల్లి భరత్ గౌడ్ తదితరులు ఉన్నారు