చండూరు, మునుగోడు, వెలుగు: మునుగోడు నియోజకవర్గంలో నూతనంగా ఎన్నికైన సర్పంచులు, వార్డు మెంబర్ల ప్రమాణ స్వీకారోత్సవం సందర్భంగా మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు. చీకటిమామిడి, కొంపెల్లి గ్రామాల్లో జరిగిన కార్యక్రమాల్లో ఆయన మాట్లాడుతూ ఎన్నికల వరకే రాజకీయాలు ఉండాలని, ఎన్నికల అనంతరం అందరూ కలిసిమెలసి గ్రామాభివృద్ధి కోసం పనిచేయాలన్నారు.
పార్టీలకతీతంగా అర్హులైన నిరుపేదలకు ప్రభుత్వ సంక్షేమాలు అందించడంలో సర్పంచులు ముందుండాలని సూచించారు. తెలంగాణలో 119 నియోజకవర్గాల్లో క్రైమ్ రేట్ తక్కువగా ఉన్న నియోజకవర్గం మునుగోడు అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నల్గొండ జిల్లా డీసీసీ అధ్యక్షుడు పున్నకైలాష్ నేత, డీసీసీబీ చైర్మన్ కుంభం శ్రీనివాస్ రెడ్డి, స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
