ఇండియా, న్యూజిలాండ్ మధ్య ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్!

ఇండియా, న్యూజిలాండ్ మధ్య ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్!

న్యూఢిల్లీ: ఇండియా, న్యూజిలాండ్ మధ్య ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్​కు సంబంధించిన చర్చలు విజయవంతం అయ్యాయి. రానున్న 3 నెలల్లో అధికారికంగా డాక్యుమెంట్లపై సంతకాలు చేసే అవకాశం ఉంది. ఆ తర్వాత ఇది అమల్లోకి రానున్నది. ప్రధాని నరేంద్ర మోదీ, న్యూజిలాండ్ ప్రధాని క్రిస్టోఫర్ లక్సన్ సోమవారం ఫోన్ ద్వారా చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నారని ఇరు దేశాల ప్రతినిధులు సంయుక్తంగా ప్రకటించారు. 2025, మార్చి 16న క్రిస్టోఫర్ ఇండియా పర్యటనకు వచ్చారు. ఆ సమయంలో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అంశం తెరపైకి వచ్చింది. 

ఇరు దేశాల ప్రతినిధులు పలుమార్లు చర్చించుకున్నారు. 9 నెలల్లోనే డీల్​ను ఫైనల్ చేశారు. ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అమల్లోకి వస్తే.. ఇండియా నుంచి న్యూజిలాండ్‌‌కు ఎగుమతయ్యే వస్తువులపై ఎలాంటి సుంకాలు ఉండవు. దీంతో ఇండియన్ గూడ్స్ అక్కడ చౌకగా లభిస్తాయి. న్యూజిలాండ్ నుంచి ఇండియాకు 95% ఎక్స్‌‌పోర్ట్‌‌లపై టారిఫ్‌‌లు తగ్గుతాయి లేదంటే మొత్తానికి తొలగించే అవకాశం ఉంది. ఇందులో 57% ప్రొడక్ట్‌‌లు డే వన్ నుంచి డ్యూటీ ఫ్రీ అవుతాయి. వచ్చే 15 ఏండ్లలో న్యూజిలాండ్ మన దేశంలో రూ.1.70 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టడానికి అంగీకరించింది.

మన స్టూడెంట్లు ఎంతమందైనా వెళ్లొచ్చు

ఇండియన్ స్కిల్డ్ ప్రొఫెషనల్స్ కోసం ప్రత్యేకంగా 5 వేల తాత్కాలిక ఉపాధి వీసాలను న్యూజిలాండ్ కేటాయించింది. ఇందులో ఐటీ, ఇంజనీరింగ్, హెల్త్‌‌కేర్, కన్​స్ట్రక్షన్ రంగాల వారికి ప్రాధాన్యం ఉంటుంది. ఆయుష్  ప్రాక్టీషనర్లు, యోగా ఇన్​స్ట్రక్టర్లు, చెఫ్​లు, మ్యూజిక్ టీచర్లకు వీసా ఈజీగా దొరికే అవకాశం ఉంది. ఎంతమంది ఇండియన్ స్టూడెంట్లకు అయినా న్యూజిలాండ్​లో ఎంట్రీ ఉంటుంది. చదువు పూర్తయిన తర్వాత 3 నుంచి 4 ఏండ్ల పాటు అక్కడే పనిచేసుకునే అవకాశం కల్పించనున్నారు. ఏటా వెయ్యి మంది యువతకు ‘వర్కింగ్ హాలిడే వీసా’ కింద న్యూజిలాండ్‌‌లో పర్యటిస్తూ పనిచేసుకునే అవకాశం లభిస్తుంది.