కోదాడ, వెలుగు: ఆకస్మికంగా విపత్తులు సంభవించినప్పుడు ప్రమాదం నుంచి ప్రజలు ఎలా అప్రమత్తం కావాలో మాక్ డ్రిల్ ద్వారా అవగాహన కల్పిస్తున్నట్లు సూర్యాపేట కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ తెలిపారు. జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీ, తెలంగాణ హోం శాఖ ఆదేశాల మేరకు సోమవారం కోదాడ పట్టణంలోని అనంతగిరి రోడ్డులోని పెద్ద చెరువు వద్ద మాక్ డ్రిల్ కార్యక్రమం నిర్వహించారు.
ఈ ప్రోగ్రాంలో కలెక్టర్ పాల్గొని సిబ్బంది సన్నద్ధత పరిశీలించారు. అదనపు కలెక్టర్ కె సీతారామారావు, అదనపు ఎస్పీ జనార్దన్ రెడ్డి, జిల్లా ఫైర్ ఆఫీసర్ వై కృష్ణారెడ్డి, కోదాడ ఆర్డీఓ సూర్యనారాయణ, డీఎస్పీ శ్రీనివాస్ రెడ్డి, కోదాడ మున్సిపల్ కమిషనర్ రమాదేవి తదితరులు పాల్గొన్నారు.
ఆసుపత్రి నిర్మాణ పనులు నాణ్యత తో చేయాలి
కోదాడలో నిర్మిస్తున్న 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణ పనులను నాణ్యతతో పూర్తి చేయాలని కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ అన్నారు. సోమవారం ఆయన ఆసుపత్రి నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నూతన హాస్పిటల్ భవన నిర్మాణ పనులు నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ త్వరిగతిన పూర్తి చేయాలన్నారు.
అనంతరం హాస్పిటల్ లో డయాలసిస్ సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలోనే డయాలసిస్ సేవలు అందించడంతో ప్రథమ స్థానంలో ఉండటంతో సిబ్బందిని అభినందించారు.
