స్టూడెంట్స్ కు ఆత్మవిశ్వాసం పెంపొందించాలి : కలెక్టర్ ఇలా త్రిపాఠి

స్టూడెంట్స్ కు ఆత్మవిశ్వాసం పెంపొందించాలి : కలెక్టర్ ఇలా త్రిపాఠి

నల్గొండ, వెలుగు: విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోకుండా చదువు పట్ల ఆత్మవిశ్వాసం పెంచేలా అవగాహన కల్పించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. సోమవారం కలెక్టరేట్ సమావేశం మందిరంలో ప్రజావాణి ముగిసిన తర్వాత అధికారులతో వివిధ అంశాలపై సమీక్ష  నిర్వహించారు.  గురుకుల విద్యాలయాల్లో చదువుతున్న కొందరు విద్యార్థులు మానసిక ఒత్తిడితో ఆత్మహత్యలకు పాల్పడుతున్న ఘటనలు బాధ కలిగిస్తున్నాయన్నారు.

 ఇలాంటి దుర్ఘటనలు పునరావృతం కాకుండా విద్యార్థులకు నిరంతరం మానసిక అవగాహన కల్పించాలన్నారు.  ప్రతి గురుకుల విద్యాలయంలో రెండు నెలలకు ఒకసారి విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం పెంచేలా అవేర్‌‌నెస్‌ ప్రోగ్రాంలు నిర్వహించాలన్నారు.  క్రీడలు, సాంస్కృతిక కార్యకలాపాలు నిర్వహించడం ద్వారా మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుందన్నారు.

 వెల్ఫేర్ హాస్టల్లో విద్యార్థులు చిన్న వయసులో డ్రగ్స్ కి అలవాటు పడుతున్నారని, వారికి చదువు పట్ల మక్కువ చూపేలా చొరవ తీసుకోవాలని అన్నారు. జిల్లాలోని అన్ని మున్సిపాలిటీ పరిధిలో కమిషనర్లతో చైల్డ్ వెల్ఫేర్ మీటింగ్ పెట్టి పిల్లలకు, తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ కల్పించే కార్యక్రమం చేపట్టాలని సూచించారు.   రెవెన్యూ అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ నారాయణ అమిత్, ఇన్‌చార్జి డీఆర్‌‌ఓ  వై. అశోక్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.