రాజపేట, వెలుగు: పంచాయతీ ఎన్నికల్లో నూతనంగా గెలుపొందిన వార్డ్ మెంబర్స్ ప్రమాణస్వీకారం బాయ్‌కాట్ చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా రాజపేట మండలం బొందుగుల గ్రామంలో జరిగింది. వివరాల్లోకి వెళితే పంచాయతీ ఎన్నికలు వెలువడిన రోజు తమ ప్రమేయం లేకుండా ఉప సర్పంచ్ ఎన్నిక జరిగిందని 12 మంది వార్డు మెంబర్లలో 9 మంది వార్డు సభ్యులు గ్రామపంచాయతీ ముందు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు.
ఉప సర్పంచ్ ఎన్నిక అక్రమంగా జరిగిందని ఆరోపించారు.అర్ధరాత్రి గందరగోళ పరిస్థితుల్లో ఉపసర్పంచ్ ని ఎన్నుకున్నట్లు అధికారులు ప్రకటించడంపై అనుమానాలు వ్యక్తం చేశారు. వార్డు సభ్యులుగా గెలిచారని సంతకాలు చేయించుకుని చివరికి ఉప సర్పంచ్‌ను ఎన్నుకున్నట్లుగా ప్రకటించి మోసం చేశారన్నారు.
దీనిపై ఉన్నతాధికారులు కలెక్టర్ చర్యలు తీసుకొని ఉపసర్పంచ్ ఎన్నికను రద్దు చేసి మళ్లీ నిర్వహించాలని డిమాండ్ చేశారు. అనంతరం ఎంపీడీవోకి వినతిపత్రం అందించారు. ప్రమాణ స్వీకారం బాయ్ కాట్ చేసిన వార్డు సభ్యులు రమేశ్, పుష్ప, వెంకటేశ్, శ్రీధర్ శేఖర్, సంధ్య, అరుణ, యాదమ్మ ఉన్నారు.
