- ఆవులు ఉన్నాయనే అనుమానంతో ఫ్లైవుడ్ లారీని అడ్డుకున్న గోరక్షకులు
- ఇరువర్గాల మధ్య ఘర్షణ, రాళ్ల దాడి
మెహిదీపట్నం, వెలుగు: ఆవులను తరలిస్తున్నారనే అనుమానంతో ఫ్లైవుడ్ లారీని గోరక్షకులు అడ్డుకోవడంతో ఆసిప్నగర్ పరిధిలో శనివారం అర్ధరాత్రి తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. గోల్కొండ జోన్ డీసీపీ చంద్రమోహన్ తెలిపిన వివరాల ప్రకారం.. రాయల్ సీ హోటల్ సమీపంలో వెళ్తున్న లారీని గోరక్షకులు అడ్డుకుని దాడికి దిగడంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ, రాళ్ల దాడి జరిగాయి. ఈ గొడవను అడ్డుకునే క్రమంలో ఒక హోంగార్డు, కానిస్టేబుల్కు గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న నాంపల్లి ఎమ్మెల్యే మాజీద్ హుస్సేన్ సంఘటనా స్థలానికి చేరుకుని లారీని పరిశీలించారు.
లారీలో కేవలం ఫ్లైవుడ్ మాత్రమే ఉందని, పశువులు లేకపోయినా అడ్డుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ డీసీపీ ఆఫీస్ ముందు ఎమ్మెల్యే ఆధ్వర్యంలో అర్ధరాత్రి ధర్నా నిర్వహించారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. లారీలో ఎలాంటి పశువులు లేవని స్పష్టం చేసిన డీసీపీ.. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా దాడికి పాల్పడిన గోరక్షకులపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేస్తామన్నారు.
