బీజేపీ సర్పంచ్ ని కాల్చి చంపిన టెర్రరిస్టులు

బీజేపీ సర్పంచ్ ని కాల్చి చంపిన టెర్రరిస్టులు

టెర్రరిస్టుల దాడిలో బీజేపీకి చెందిన సర్పంచ్ హతమయ్యారు. జమ్మూ కాశ్మీర్‌లోని కుల్గాం జిల్లాలో ఈ ఘటన జరిగింది. శ్రీనగర్ కు 60 కిలోమీటర్ల దూరంలోని ఖాజిగుండ్ సర్పంచ్ అయిన సాజిద్ అహ్మద్ ఖండేను ఆయన ఇంటి సమీపంలోనే టెర్రరిస్టులు కాల్చి చంపారు. సాజిద్ సర్పంచ్ మాత్రమే కాదు.. కుల్గంకు బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడుగా కూడా ఉన్నారు. దాడి జరిగిన వెంటనే స్థానికులు సాజిద్ ను సమీపంలోని అనంతనాగ్ జిల్లాలోని ఒక ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే సాజిద్ మృతిచెందినట్లు వైద్యులు తేల్చారు.

ఇదే జిల్లాలో బీజేపీకి చెందిన సర్పంచ్ ఆరిఫ్ అహ్మద్ ను హతమార్చి 48 గంటలు కూడా గడవక ముందే ఈ ఘటన చోటుచేసుకుంది. ఆరిఫ్ పై ఆగష్టు 4న దాడి జరిగింది. గత నెలలో కూడా బండిపూర్ జిల్లాలో బీజేపీకి చెందిన షేక్ వసీమ్ బారి, అతని తండ్రి మరియు సోదరుడిని కూడా ఉగ్రవాదులు కాల్చి చంపారు. షేక్ వసీమ్ బారి బండిపూర్‌కు జిల్లా చీఫ్‌గా బాధ్యతలు నిర్వర్తించేవారు.

ఈ దాడికి ఒక కొత్త టెర్రర్ గ్రూప్ అయిన ది రెసిస్టెన్స్ ఫ్రంట్ బాధ్యత వహిస్తున్నట్లు ప్రకటించుకుంది. ఈ గ్రూప్ జైష్, లష్కర్-ఎ-తైబా మరియు హిజ్బుల్ ముజాహిదీన్ల లాంటిదేనని పోలీసులు తెలిపారు.

కుల్గాంలో జరిగిన ఉగ్రవాద దాడిని రాజకీయ నాయకులు ఖండించారు. బండిపూర్‌కు జిల్లా చీఫ్‌ వసీం మరణం పార్టీకి భారీ నష్టమని బీజేపీ చీఫ్ జెపి నడ్డా అన్నారు. ‘వసీం మరణం పార్టీకి చాలా పెద్ద నష్టం. ఆయన కుటుంబానికి నా సంతాపం తెలియజేస్తున్నాను. మొత్తం పార్టీ వసీం కుటుంబానికి అండగా ఉంటుంది. వసీం కుటుంబసభ్యుల త్యాగం ఊరికే పోదని నేను భరోసా ఇస్తున్నాను’ అని ట్వీట్ చేశారు.

For More News..

కరోనా పేషంట్లకు వైద్యం చేసిన ఏపీ ఎమ్మెల్యే

ఎమ్యెల్యే రామలింగారెడ్డి మృతి నాకు వ్యక్తిగతంగా తీరని లోటు

జ‌మ్ముక‌శ్మీర్ తొలి గ‌వ‌ర్న‌ర్ రాజీనామా.. రెండో గవర్నర్‌గా మ‌నోజ్ సిన్హా