జూన్ 19 నుంచి టీజీ ఎప్‌‌సెట్ కౌన్సెలింగ్..జూన్ 25 నుంచి వెబ్ ఆప్షన్లు 

జూన్ 19 నుంచి టీజీ ఎప్‌‌సెట్ కౌన్సెలింగ్..జూన్ 25 నుంచి వెబ్ ఆప్షన్లు 
  • జులై 10న తొలి విడత సీట్ల కేటాయింపు
  • మూడు విడతల్లో బీటెక్​ ప్రవేశాల ప్రక్రియ 
  • ఆగస్టు 1 నుంచి ఇంజినీరింగ్ క్లాసులు షురూ : విద్యాశాఖ షెడ్యూల్ విడుదల

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కాలేజీల్లో ప్రవేశాలకు సంబంధించిన ‘టీజీ ఎప్‌‌సెట్’ అడ్మిషన్ల కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదలైంది.  సోమవారం హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ లో టీజీ ఎప్ సెట్ అడ్మిషన్ల కమిటీ సమావేశం టీజీసీహెచ్ఈ చైర్మన్ బాలకిష్టారెడ్డి, టెక్నికల్ ఎడ్యుకేషన్ కమిషనర్ శ్రీదేవసేన నేతృత్వంలో జరిగింది. మొత్తం మూడు విడతల్లో కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. ఈ నెల 19న ప్రారంభమయ్యే ఈ ప్రక్రియ, ఆగస్టు రెండో వారంలో స్పాట్ అడ్మిషన్లతో ముగియనుంది. కాగా, ఆగస్టు 1వ తేదీ నుంచి ఇంజినీరింగ్ క్లాసులు ప్రారంభం కానున్నాయి.

తొలి విడత షెడ్యూల్ ఇలా.. 

మొదటి విడత కౌన్సెలింగ్ ప్రక్రియ ఈనెల 19న ప్రారంభం కానుంది. విద్యార్థులు ఈ నెల 19 నుంచి 28వ తేదీ వరకు ఆన్‌‌లైన్‌‌లో బేసిక్ ఇన్ఫర్మేషన్ నమోదు చేసి, ప్రాసెసింగ్ ఫీజు చెల్లించి, సర్టిఫికెట్ వెరిఫికేషన్ కోసం స్లాట్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది.  22 నుంచి 29 వరకు హెల్ప్ లైన్ సెంటర్లలో సర్టిఫికెట్ల పరిశీలన జరుగుతుంది.

సర్టిఫికెట్ వెరిఫికేషన్ పూర్తయిన వారు 25 నుంచి జులై 1 వరకు వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవచ్చు. విద్యార్థుల సౌలభ్యం కోసం జులై 4న మాక్ సీట్ అలాట్‌‌మెంట్ ఉంటుంది. ఆ తర్వాత అవసరమైతే ఆప్షన్లలో మార్పులు చేసుకునేందుకు జులై 7 వరకు అవకాశం కల్పించారు. జులై 10న తొలి విడత సీట్ల కేటాయింపు ఉంటుంది. సీటు పొందిన వారు జులై 14 లోగా ట్యూషన్ ఫీజు చెల్లించి వెబ్‌‌సైట్ ద్వారా సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి. 

రెండో విడత నుంచి ఫిజికల్ రిపోర్టింగ్ తప్పనిసరి

తొలి విడతలో సీటు రాని వారు, సర్టిఫికెట్ వెరిఫికేషన్ చేయించుకోని వారి కోసం జులై 17 నుంచి రెండో విడత కౌన్సెలింగ్ ప్రారంభమవుతుంది. జులై 18న సర్టిఫికెట్ల వెరిఫికేషన్, జులై 18, 19 తేదీల్లో వెబ్ ఆప్షన్లకు అవకాశం కల్పిస్తారు. జులై 22న రెండో విడత సీట్లను కేటాయిస్తారు. అయితే, ఈ విడతలో సీటు పొందిన అభ్యర్థులు జులై 25 నుంచి 28వ తేదీ లోపు తమకు కేటాయించిన కాలేజీకి వెళ్లి స్వయంగా (ఫిజికల్ రిపోర్టింగ్) హాజరుకావడం తప్పనిసరి. అలా రిపోర్ట్ చేయని వారు చివరి విడత కౌన్సెలింగ్‌‌కు అనర్హులవుతారని కమిటీ స్పష్టం చేసింది.

ఆగస్టు 1 నుంచి కాలేజీలు..

చివరి విడత కౌన్సెలింగ్ జులై 31న ప్రారంభమై, ఆగస్టు 5న సీట్ల కేటాయింపుతో ముగుస్తుంది. కాలేజీల్లో క్లాస్ వర్క్ ఆగస్టు 1 నుంచే ప్రారంభం కానుంది. కాలేజీల్లో అంతర్గతంగా బ్రాంచీలు మార్చుకునేందుకు (ఇంటర్నల్ స్లైడింగ్) ఆగస్టు 12, 13 తేదీల్లో అవకాశం కల్పించారు. మిగిలిపోయిన సీట్ల భర్తీ కోసం ఆగస్టు 16న స్పాట్ అడ్మిషన్ల మార్గదర్శకాలను విడుదల చేయనున్నారు. ఈసారి కౌన్సెలింగ్‌‌లో ఆప్షన్ల ఎంపికపై విద్యార్థులు జాగ్రత్తగా ఉండాలని, ప్రతి విడతలోనూ కొత్తగా ఆప్షన్లు ఇచ్చుకోవడం తప్పనిసరి అని అధికారులు సూచించారు.