జూన్ 15 నుంచి టీజీ ఈసెట్ కౌన్సెలింగ్

జూన్ 15 నుంచి టీజీ ఈసెట్ కౌన్సెలింగ్
  • ఈనెల 24న తొలి విడత సీట్ల కేటాయింపు
  • జులై 20 నాటికి ముగియనున్న ప్రవేశాల ప్రక్రియ
  • షెడ్యూల్ విడుదల చేసిన అడ్మిషన్ల కమిటీ

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని ఇంజినీరింగ్, ఫార్మసీ కాలేజీల్లో రెండో ఏడాదిలో నేరుగా చేరేందుకు నిర్వహించే ‘టీజీ ఈసెట్’ అడ్మిషన్ల కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదలైంది. సోమవారం హైదరాబాద్‌‌లో టీజీసీహెచ్‌‌ఈ చైర్మన్ బాలకిష్టారెడ్డి, టెక్నికల్ ఎడ్యుకేషన్ కమిషనర్ శ్రీదేవసేన నేతృత్వంలో అడ్మిషన్ల కమిటీ సమావేశమై ఈ షెడ్యూల్‌‌ను ఖరారు చేసింది.  ఈనెల 15 నుంచి ఫస్ట్ ఫేజ్ అడ్మిషన్ కౌన్సెలింగ్ ప్రారంభం కానున్నది.

అభ్యర్థులు ఈ నెల 15 నుంచి 18 వరకు ఆన్‌‌లైన్‌‌లో బేసిక్ వివరాలు నమోదు చేసి, ప్రాసెసింగ్ ఫీజు చెల్లించి సర్టిఫికెట్ వెరిఫికేషన్ కోసం స్లాట్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది.  17 నుంచి 19వ తేదీ  వరకు సర్టిఫికెట్ల పరిశీలన, ఈ నెల 17 నుంచి 21 వరకు వెబ్ ఆప్షన్ల ఎంపికకు అవకాశం కల్పించారు. ఈ నెల 24న తొలి విడత సీట్లను కేటాయించనుండగా.. సీట్లు పొందిన వారు 24 నుంచి 27వ తేదీలోగా ఆన్‌‌లైన్‌‌లో ట్యూషన్ ఫీజు చెల్లించి సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలని అధికారులు సూచించారు. 

జులై 4 నుంచి సెకండ్ ఫేజ్..

సెకండ్ ఫేజ్ కౌన్సెలింగ్ జులై 4 నుంచి ప్రారంభం కానుంది. మొదటి విడతలో రిజిస్ట్రేషన్ చేసుకోని వారు జులై 4, 5 తేదీల్లో స్లాట్ బుకింగ్ చేసుకోవచ్చు. వీరికి జులై 6న సర్టిఫికెట్ వెరిఫికేషన్, జులై 6, 7 తేదీల్లో వెబ్ ఆప్షన్ల ఎంపికకు గడువు ఇచ్చారు.

జులై 9న తుది విడత సీట్లను కేటాయిస్తారు. సీట్లు పొందిన అభ్యర్థులు జులై 9 నుంచి 12వ తేదీ లోగా ఆన్‌‌లైన్ రిపోర్టింగ్ పూర్తి చేసి, జులై 10 నుంచి 13వ తేదీ లోపు సంబంధిత కాలేజీల్లో ఒరిజినల్ సర్టిఫికెట్లతో స్వయంగా రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. ప్రైవేట్ అన్ ఎయిడెడ్ ఇంజినీరింగ్, ఫార్మసీ కాలేజీల్లో మిగిలిపోయిన సీట్ల భర్తీ కోసం జులై 14న స్పాట్ అడ్మిషన్ల గైడ్‌‌లైన్స్ విడుదల చేస్తారు. జులై 20వ తేదీ నాటికి స్పాట్ అడ్మిషన్లతో సహా పూర్తి అడ్మిషన్ల ప్రక్రియను ముగించనున్నట్లు అడ్మిషన్ల కన్వీనర్ ఏ. శ్రీదేవసేన వెల్లడించారు.