- అదేరోజు నుంచి ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్లు, ఫీజు చెల్లింపు
- జూన్ 6న మొదటి విడత సీట్ల కేటాయింపు
హైదరాబాద్, వెలుగు: తెలంగాణలో పాలిటెక్నిక్ కాలేజీల్లో అడ్మిషన్లకు సంబంధించి టీజీ పాలిసెట్–2026 అడ్మిషన్ల ప్రక్రియ ఈ నెల 27 నుంచి ప్రారంభం కానుంది. దీనికి సంబంధించి కౌన్సెలింగ్ షెడ్యూల్ను టెక్నికల్ ఎaడ్యుకేషన్ కమిషనర్ శ్రీదేవసేన సోమవారం విడుదల చేశారు. ఫస్ట్ ఫేజ్ కౌన్సెలింగ్‌లో భాగంగా అభ్యర్థులు ఆన్‌లైన్‌లో బేసిక్ ఇన్ఫర్మేషన్ నమోదు చేసుకోవడంతోపాటు ప్రాసెసింగ్ ఫీజు చెల్లించి సర్టిఫికెట్ల పరిశీలనకు స్లాట్ బుక్ చేసుకోవాలన్నారు.
ఫస్ట్ ఫేజ్ అడ్మిషన్ల ప్రక్రియలో ఈ నెల 27 నుంచి 31వ వరకు ఆన్‌లైన్ ఫైలింగ్, ప్రాసెసింగ్ ఫీజు చెల్లింపు, స్లాట్ బుకింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. స్లాట్ బుక్ చేసుకున్న అభ్యర్థులకు ఈ నెల 29 నుంచి జూన్ 1 వరకు సర్టిఫికెట్లను పరిశీలిస్తారు. మే 29 నుంచి జూన్ 3 వరకు వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవచ్చు. జూన్ 6న ఫస్ట్ ఫేజ్ సీట్ల కేటాయింపు ఉంటుంది. జూన్ 8, 9 తేదీల్లో అభ్యర్థులు కాలేజీల్లో రిపోర్టింగ్ చేయాలి. ఫైనల్ ఫేజ్ అడ్మిషన్ల ప్రక్రియ ఫస్ట్ ఫేజ్లో పాల్గొనని వారికి జూన్ 15 నుంచి రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఉంటుంది. జూన్ 16, 17 తేదీల్లో వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవచ్చు. జూన్ 20న సీట్లు కేటాయిస్తారు. జూన్ 27, 28 తేదీల్లో ఇంటర్నల్ స్లైడింగ్ కోసం ఆప్షన్లు ఇచ్చుకునే అవకాశం ఉంటుంది.
ముందస్తు ప్లానింగ్ ముఖ్యం..
సర్టిఫికెట్ల పరిశీలన కంటే ముందే స్లాట్ బుక్ చేసుకుంటే, వెబ్ ఆప్షన్లు ఎంచుకోవడానికి అభ్యర్థులకు ఎక్కువ సమయం లభిస్తుందని అధికారులు సూచించారు. కాబట్టి విద్యార్థులు ఆలస్యం చేయకుండా ప్రాసెసింగ్ ఫీజు చెల్లించి, స్లాట్ బుక్ చేసుకోవాలని కోరారు. పూర్తి వివరాల కోసం https://tgpolycet.nic.in వెబ్‌సైట్‌ను సందర్శించాలని తెలిపారు.
