ఈవీ బస్సుల్లో ఆర్టీసీకి ప్రశంసలు..స్పేర్ పార్ట్స్ ధరల నియంత్రణకు ప్రత్యేక కమిటీ: ఎండీ నాగిరెడ్డి

ఈవీ బస్సుల్లో ఆర్టీసీకి ప్రశంసలు..స్పేర్ పార్ట్స్ ధరల నియంత్రణకు ప్రత్యేక కమిటీ: ఎండీ నాగిరెడ్డి

హైదరాబాద్, వెలుగు: ఉత్తరాఖండ్‌‌లోని ముస్సోరీ వేదికగా జరిగిన అసోసియేషన్ ఆఫ్ స్టేట్ రోడ్ ట్రాన్స్‌‌పోర్ట్ అండర్‌‌టేకింగ్స్ అఖిల భారత సమావేశంలో టీజీఎస్ ఆర్టీసీ ఎండీ వై. నాగిరెడ్డి రాష్ట్ర రవాణా వ్యవస్థ ప్రతిష్ఠను దేశస్థాయిలో చాటారు. అసోసియేషన్ చైర్మన్‌‌గా సమావేశానికి అధ్యక్షత వహించిన ఆయన, ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న యుద్ధ పరిస్థితుల కారణంగా పెరుగుతున్న బస్సు స్పేర్ పార్ట్స్ ధరలను నియంత్రించేందుకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు.

వెండర్లతో చర్చలు జరిపి ఆర్టీసీలపై అదనపు ఆర్థిక భారం పడకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. రాష్ట్రంలో పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యం ఇస్తూ ఎలక్ట్రిక్ బస్సులను విజయవంతంగా నిర్వహిస్తున్నామని నాగిరెడ్డి చెప్పారు. టీజీఎస్ ఆర్టీసీ అమలు చేస్తున్న ఎలక్ట్రిక్ బస్సుల నిర్వహణ విధానం దేశానికే ఆదర్శంగా నిలిచిందని పేర్కొన్నారు. భవిష్యత్తులో మరిన్ని విద్యుత్ బస్సులను ప్రవేశపెట్టి హైదరాబాద్ నగరాన్ని కాలుష్యరహిత రవాణా కేంద్రంగా తీర్చిదిద్దే దిశగా ముందుకెళ్తున్నామని స్పష్టం చేశారు.

గ్యారేజీల నిర్వహణలో ఐటీ టెక్నాలజీని వాడుకుంటూ డిజిటలైజేషన్ చేపట్టామని, దీని వల్ల వాహనాల ఫిట్‌‌నెస్ మెరుగుపడటంతో పాటు ప్రయాణికులకు మరింత సురక్షిత సేవలు అందుతున్నాయని వివరించారు. ఇదే సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తూ రికార్డు స్థాయిలో ప్రయాణాలను పూర్తి చేసిన తీరుపై ఇతర రాష్ట్రాల ఆర్టీసీ ప్రతినిధులు ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. ఈ సదస్సులో వివిధ రాష్ట్రాల ఆర్టీసీ చైర్మన్లు, ఈడీలు పాల్గొని రవాణా రంగ పురోగతిపై విస్తృతంగా చర్చించారు.