బడుల్లో భారీగా సబ్జెక్టు టీచర్ల కొరత

బడుల్లో భారీగా సబ్జెక్టు టీచర్ల కొరత
  • జిల్లాల్లో కొనసాగుతున్న ప్రక్రియ
  • రేషనలైజేషన్ రూల్స్ ప్రకారం అడ్జెస్ట్​మెంట్
  • బడుల్లో భారీగా సబ్జెక్టు టీచర్ల కొరత
  • అయినా వీవీల నియామకం ఊసెత్తని సర్కార్

హైదరాబాద్, వెలుగు : రాష్ట్రంలోని సర్కారు బడుల్లో టీచర్ల సర్దుబాటు ప్రక్రియ మొదలైంది. ప్రస్తుతం పనిచేస్తున్న టీచర్లనే, అవసరమున్న స్కూళ్లకు పంపిస్తున్నారు. అయినా ఇంకా భారీగా ఖాళీలు ఉన్నా.. కొత్తగా విద్యా వలంటీర్లను నియమించాలనే ఆలోచన రాష్ట్ర సర్కారు చేయడం లేదు. దీంతో బడుల్లో సబ్జెక్టు టీచర్ల కొరతతో స్టూడెంట్లు ఇబ్బందులు పడుతున్నారు.

జిల్లాల్లో మొదలైన ప్రక్రియ
రాష్ట్రంలో 26 వేలకు పైగా సర్కారు బడులుండగా, వాటిలో 1.03 లక్షల మంది టీచర్లు పనిచేస్తున్నారు. గత నెల13 నుంచి స్కూళ్లు రీఓపెన్ అయ్యాయి. ఈ విద్యాసంవత్సరం కొత్తగా 15 వేలకు పైగా బడుల్లో ఇంగ్లిష్ మీడియం క్లాసులను ప్రారంభించారు. బడులు తెరిచి నెలరోజులైనా, ఇప్పటికీ టీచర్ల ఖాళీల భర్తీపై రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేయట్లేదు. విద్యా వలంటీర్లతోనైనా అడ్జెస్ట్ చేసే ఆలోచన లేదు. ఇదే విషయమై ఇటీవల ‘వేల స్కూళ్లలో ఒక్కరిద్దరే టీచర్లు’ హెడ్డింగ్​తో ‘వెలుగు’లో కథనం ప్రచురితమైంది. వేల బడుల్లో సబ్జెక్టు టీచర్ల కొరత ఉందని, అయినా ప్రభుత్వం విద్యా వలంటీర్లను నియమించడం లేదని, ఉన్న టీచర్లను కూడా సర్దుబాటు చేయడం లేదనే విషయాన్ని ఎత్తిచూపింది. దీంతో స్పందించిన విద్యా శాఖ సెక్రటరీ వాకాటి కరుణ ఈ నెల 6న డీఈవోలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. బడుల్లో ప్రస్తుతం ఉన్న ఎన్​రోల్​మెంట్ ఆధారంగా టీచర్ల సర్దుబాటు చేసుకోవాలని డీఈవోలకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో జిల్లాల్లో టీచర్ల సర్దుబాటు ప్రక్రియ మొదలైంది.

ఇప్పటికే 3 వేల మంది అడ్జెస్ట్
స్కూళ్లు, టీచర్లను రేషనలైజేషన్​చేయాలని విద్యా శాఖ రెండు, మూడేండ్ల నుంచి భావిస్తోంది. దీనికి సంబంధించిన నిబంధనలను సర్కారు గతంలోనే రెడీ చేసింది. కానీ ఎంతమంది స్టూడెంట్లకు, ఎంతమంది టీచర్లు ఉండాలనే దానిపై స్పష్టమైన ఆదేశాలిచ్చింది. అయితే రాజకీయ కారణాలతో ప్రభుత్వం ఈ ప్రక్రియ నిర్వహించడం లేదు. కానీ గతంలో ఇచ్చిన రేషనలైజేషన్​నిబంధనల ప్రకారమే ప్రస్తుతం టీచర్ల వర్క్ అడ్జెస్ట్ చేయాలని సర్కారు ఆదేశాలు ఇచ్చింది. దీంతో జిల్లాస్థాయిల్లో డీఈవోలు.. ఎంఈవోలు, కాంప్లెక్స్ హెడ్మాస్టర్ల నుంచి ఖాళీలు, అవసరం ఉన్న స్కూళ్ల వివరాలు సేకరించారు. ముందుగా స్కూల్ కాంప్లెక్స్ యూనిట్​గా, ఆ తర్వాత మండలం యూనిట్​గా టీచర్ల సర్దుబాటు చేయాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. ఆ తర్వాతే పక్క మండలాల్లో అడ్జెస్ట్ చేయాలని సూచించారు. దీనికి అనుగుణంగా రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే 3 వేల మంది టీచర్లను ఇతర బడుల్లో సర్దుబాటు చేసినట్టు అధికారులు చెప్తున్నారు. మరో వెయ్యి మందిని అడ్జెస్ట్​ చేసే అవకాశముందని అంచనా వేస్తున్నారు.

విద్యా వలంటీర్లను తీసుకోరా..
కరోనా కంటే ముందు సర్కారు బడుల్లో 16 వేల మంది విద్యా వలంటీర్లు పనిచేశారు. కానీ రెండేండ్లుగా వారిని రెన్యువల్ చేయలేదు. ఈ ఏడాది ఇంగ్లిష్ మీడియం సెక్షన్లు మొదలైనా, గతేడాది భారీగా స్టూడెంట్లు చేరినా వలంటీర్లను మాత్రం తీసుకోవడం లేదు. దీంతో ప్రైమరీ స్కూళ్లతోపాటు హైస్కూళ్లలోనూ టీచర్ల కొరత వేధిస్తోంది. ప్రస్తుతం పనిచేస్తున్న టీచర్లు, హెడ్మాస్టర్లు, పేరెంట్స్, స్టూడెంట్ యూనియన్లు సర్కారు పెద్దల దగ్గరకు సమస్యను తీసుకుపోయినా పట్టించుకోవడం లేదు. ఇప్పటికైనా టీఆర్టీ రిక్రూట్​మెంట్​ అయ్యేంత వరకూ టీచర్ ఖాళీల్లో విద్యా వలంటీర్లను నియమించాలని కోరుతున్నారు.