రిజర్వేషన్లు గుంజుకుంటున్నది .. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు అన్యాయం చేస్తున్నది : రాహుల్ గాంధీ

రిజర్వేషన్లు గుంజుకుంటున్నది .. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు అన్యాయం చేస్తున్నది  :  రాహుల్ గాంధీ

న్యూఢిల్లీ/శివమొగ్గ:  దళితులు, గిరిజనులు, ఓబీసీల రిజర్వేషన్లను కేంద్ర ప్రభుత్వం గుంజుకుంటున్నది కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. ‘‘కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం గుడ్డిగా ప్రైవేటైజేషన్ చేస్తున్నది. ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ ప్రైవేట్ పరం చేస్తున్నది. ఫలితంగా ప్రభుత్వ ఉద్యోగాలు తగ్గిపోతున్నయ్. తద్వారా ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల నుంచి రిజర్వేషన్లను లాక్కుంటున్నది. ప్రభుత్వ ఉద్యోగాలే లేనప్పుడు.. ఇక రిజర్వేషన్లు ఎట్ల ఉంటయ్?” అని గురువారం సోషల్ మీడియా ‘ఎక్స్’లో రాహుల్ పోస్టు పెట్టారు. ‘‘పబ్లిక్ సెక్టార్ లో 2013లో 14 లక్షల పర్మనెంట్ ఉద్యోగాలు ఉండేవి. 

కానీ అవి 2023 నాటికి 8.4 లక్షలకు తగ్గిపోయాయి. బీఎస్ఎన్ఎల్, బీహెచ్ఈఎల్, ఎస్ఏఐఎల్ లాంటి ప్రభుత్వ రంగ సంస్థలను కేంద్ర ప్రభుత్వం నాశనం చేస్తున్నది. వాటిల్లో దాదాపు 6 లక్షల ఉద్యోగాలను తొలగించింది” అని అందులో పేర్కొన్నారు. ‘‘మోదీ ప్రభుత్వం దేశ వనరులను ప్రైవేట్ పరం చేస్తూ దోచుకుంటున్నది. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ పరం చేస్తూ పేదలకు ఉద్యోగాలు లేకుండా చేస్తున్నది. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ప్రభుత్వ రంగ సంస్థలను మరింత బలోపేతం చేస్తం. ఏటా 30 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తాం” అని హామీ ఇచ్చారు. 

సమానత్వం కోరుకుంటే నక్సలైట్లా? 

సమానత్వం కోరుకునేటోళ్లు నక్సలైట్లు అంటూ బీజేపీ చీఫ్ నడ్డా కామెంట్ చేశారని రాహుల్ మండిపడ్డారు. ‘‘బీజేపీ లీడర్లు మరోసారి రాజ్యాంగంపై దాడి చేశారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలు సమానత్వం కోరుకుంటే.. వాళ్లు నక్సలైట్లతో సమానమని నడ్డా అన్నారు. రాజ్యాంగంపై ఇంతకుమించిన దాడి ఉంటుందా?” అని ప్రశ్నించారు. గురువారం కర్నాటకలోని శివమొగ్గలో నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో రాహుల్ మాట్లాడారు. ‘‘బీజేపీ నిజంగానే రాజ్యాంగాన్ని రక్షించాలని అనుకుంటే, ఆ పార్టీ ప్రెసిడెంట్ నడ్డా సమానత్వంపై ఎందుకు దాడి చేస్తున్నారు? సమానత్వం కోరుకునేటోళ్లను ఆయన నక్సలైట్లుని ఎందుకు అన్నారు? దీనికి ప్రధాని మోదీ సమాధానం చెప్పాలి” అని రాహుల్​ డిమాండ్​ చేశారు.